రెండో విడతగా ఆర్థికశాఖ అనుమతి
ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీస్‌శాఖల్లో ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. తాజాగా ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి,పోలీసు నియామక సంస్థ, విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రోస్టర్ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.