మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞానమే కేంద్రంగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఎదగడానికి ముందుకెళ్తున్న తరుణంలో యువత కీలకం కానుంది. కావున యువ జనాభా పెరుగుదలను సమస్యగా కాకుండా అవకాశంగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతీ, యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జనాభా ధోరణులు పేర్కొంటున్నాయి. వారికి సరైన అవకాశాలు కల్పించి శ్రామిక శక్తిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువ జనాభా ప్రాముఖ్యతతో పాటు వారి గళాన్ని తెలియడానికి ఐక్యరాజ్యసమితి 2000 ఆగస్టు 12 నుండి ప్రతి ఏటా ప్రపంచ యువజన దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. యువత కోసం గ్రీన్ స్కిల్స్: టువర్డ్ ఎ సస్టైనబుల్ వరల్డ్ అనే నినాదం (Green Skills for Youth: Towards a Sustainable World). ఈ ఏడాది ఈ దినోత్సవం ప్రత్యేకత.
ప్రపంచ స్థాయిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్రియలలో యువత భాగస్వామ్యాన్ని ఈ రోజు గుర్తుచేస్తుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో యువ భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నినాదం సైతం దీన్ని నొక్కి చెబుతుంది. దేశాభివృద్ధిలో యువ జనాభా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ నేటి సమకాలీన పరిస్థితు ల్లో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలు యువతను పట్టి పీడిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి యువత కాలాన్ని వృథా చేస్తూ పెడదారి పట్టిస్తున్నాయి. మాదకద్రవ్యాల, మద్యపానం , ధూమపానం లాంటి వ్యసనాలు ఉచ్చులో యువత చిక్కుకొని జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వ్యభిచారం, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లింగ వివక్ష యువ మహిళా సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. రోజు రోజుకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి హత్యలు, అత్యాచారాలు, మానభంగాల లాంటి దుస్సంస్కృతితో పాటు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. భూగ్రహంపై సగం మంది వ్యక్తులు 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
ఇది 2030 చివరి నాటికి 57%కి చేరుకుంటుందని అంచనా. అయితే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.6% మంది పార్లమెంటేరియన్లు 30 ఏళ్లలోపు వారు ఉన్నారు. ఈ యువ ఎంపిలలో 1% కంటే తక్కువ మంది మహిళలుండడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పోషించే యువ జనాభా స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ యువజన నివేదిక’ (world youth report 2020) పేరుతో వెలిబుచ్చిన పలు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నవి. ప్రపంచ దేశాలు ఎజెండా 2030 ముందుకు తీసుకెళ్ళే క్రమంలో యువత ‘సామాజిక వ్యవస్థాపకత’ (social entrepreneurship) సూత్రాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతోంది. నేడు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల యువకులు ప్రపంచ జనాభాలో 16 శాతం ఉన్నారని, వీరు 2030 నాటికి 15.1 శాతంగా, 2050 నాటికి 13.8 శాతానికి తగ్గుతారని అంచనాలు పేర్కొనగా, అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలలో యువ జనాభా పెరుగుదల అధికంగా ఉంటుందని పేర్కొనడం ఈ దేశాల అభివృద్ధికి ఊతమిచ్చే విషయం.
అంతేకాకుండా ప్రస్తుతం మన దేశంలో పనిచేసే యువకుల సాధారణ సగటు వయసు 29 సంవత్సరాలు. ఈ పరిణామం భారత్ లాంటి దేశానికి అందివచ్చే విషయం. అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ కార్మికులలో 96.8 శాతం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో పని చేస్తున్నారని పేర్కొనడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఉపాధి, విద్య లేదా శిక్షణ లేని యువకుల నిష్పత్తి గత 15 సంవత్సరాలుగా దారుణంగా పెరిగిపోయిందని, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి రాబోయే 15 సంవత్సరాల్లో 60 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని ఇటీవల అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ప్రపంచ దేశాలు దీటైన వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక సారాంశం హితవు పలుకుతున్నది. యువతను నైపుణ్యం గల శ్రామికశక్తిగా మార్చకపోతే వీరు సామాజిక అస్థిరత కారణమై జాతి భద్రతకు పెను సవాళ్లుగా మారుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని సమర్థవంతమైన మానవ వనరులుగా మార్చడానికి ప్రభుత్వాలు చట్టపరమైన, విధానపరమైన చర్యలతో ముందుకు వెళ్లాలి.
మరోవైపు హరితాభివృద్ధి చర్యలతో ప్రపంచ దేశాలు ముందుకు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి హితువు పలుకుతున్న నేపథ్యంలో ‘ప్రపంచ యువజన నివేదిక’ లో పేర్కొనబడిన లాభాపేక్షలేని సామాజిక వ్యవస్థాపకతకు పెద్ద పీట వేయాలి. ఇది ఆదాయ అసమానతలను తగ్గించి, సామాజిక మార్పుకు చోదక శక్తిగా వ్యవహరిస్తుందని ప్రముఖ సామాజిక వ్యవస్థాపకులు విలియం డ్రేటన్ అభిప్రాయపడ్డాడు. ఇది సాంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా యువతకు ఆర్థిక సాధికారతను కల్పిస్తూ సామాజిక అభివృద్ధికి దోహదం చేయడానికి దోహదం చేస్తుంది. కావున ఇలాంటి వ్యాపారాల పట్ల యువతకు అవగాహన కల్పించి పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించాలి. పర్యావరణహిత చర్యల ద్వారా మరిన్ని ఉద్యోగాల సృష్టించాలి. భారత్ లాంటి అధిక యువ జనాభా గల దేశంలో మానవ వనరులే పెట్టుబడిగా భావించాల్సిన అవసరం ఉంది. సంపదను సృష్టించగలిగే సామర్ధ్యాలను యువతకు అందించడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానంలోని పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యపై శిక్షణ ఇవ్వాలని పేర్కొనడం హర్షణీయం.
యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తగిన శిక్షణ ఇచ్చి, సంస్థాగత రుణ సదుపాయాన్ని కల్పించాలి. యువత కుటీర పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రోత్సహించాలి. ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల, ఆర్థిక క్రమశిక్షణ పట్ల యువతీ, యువకులకు అవగాహన కల్పించాలి. యువత వ్యవసాయాన్ని ఉపాధిగా స్వీకరించడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. యువతకు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి పై పాఠశాల స్థాయిలో నుంచే బోధించాలి.