Sunday, December 22, 2024

ఎపి మరో ఉల్లంఘన

- Advertisement -
- Advertisement -

నిబంధనలకు రెడ్‌కో

జలసంఘం అనుమతి లేకుండానే కృష్ణా జలాలతో గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు
కర్నూల్, నంద్యాల జిల్లాల సరిహద్దులో5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్షంతో రూ.15వేల కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ఆ రాష్ట్ర సిఎం వై.ఎస్. జగన్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు పేరుతో గ్రీన్‌కో ఎనర్జీస్ కంపెని నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టుకు కృష్ణానదీజలాలను కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదాస్పద అంశానికి తెర లేపింది. ఏ ప్రాజెక్టుకైనా నీటి కేటాయింపులు జరపాలంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్‌లను సమర్పించి కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోవాల్సివుంది. అయితే అ టువంటి అనుమతులేవి తీసుకోకుండానే ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు ప్రా జెక్టుకు నీటిని కేటాయించటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కృష్ణానదీజలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణానదీయాజమాన్య బోర్డుకు కూడా గ్రీన్‌కో ప్రాజెక్టుకు కృష్ణానదీజలాల నీటికేటాంపులపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు, ఎపి అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం కాకపోయినప్పటికీ కనీసం ముందస్తు అనుమతి లేకుండా కృష్ణాజలాలను ఈ ప్రాజెక్టుకు ఏకపక్షంగా కేటాయించటంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపిలోని కర్నూలు , నంద్యాల జిల్లాల సరిహద్దుల్లో గ్రీన్‌కో ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు. సుమారు 15వేలకోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3000మెగావాట్లు , గాలి మరల ద్వారా పవన విద్యుత్ 550 మెగావాట్లు , జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. అయితే జలవిద్యుత్ ఉత్పత్తికోసం ఏపి ప్రభుత్వం గ్రీన్‌కో కంపెనీకి కృష్ణానదీ జలాలనుంచి ఒక టిఎంసి నీటిని కేటాయించింది. ఈ నీటిని శ్రీశైలం కుడిగట్టు కాలువ పధకంలో భాగంగా నంద్యాల జిల్లాలోని గోరుకల్లు వద్ద నిర్మించిన పి.వి నరసింహరాయ సాగర్ జలాశయం నుంచి గ్రీన్‌కో కంపెనీకి సరఫరా చేస్తారు.

ఈ హైడల్ ప్రాజెక్టునుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను హైడల్ పవర్ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌గా పేర్కొంటారు. హైడల్ పవర్ జనరేషన్‌ను పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టే వీలుంటుంది. అయితే ఇక్కడ మాత్రం ప్రతిపాదిత స్థలంలో పైన , కింద రెండు ప్రాజెక్టులు నిర్మిస్తారు . విద్యుత్ వాడకానికి అంతగా డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందకు వదిలి టర్బైన్ల ద్వారా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని అందుకే దీన్ని పంప్డ్ స్టోరేజి హైడల్ పవర్‌గా పేర్కొన్నట్టు గ్రీన్‌కో కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ జలవిద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం గొరకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టిఎంసీ నీటిని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

బోర్డుకు అనుమతి అవసరం లేదా!

కృష్ణానదీజలాలను వినియోగించుకునేందుకు గ్రీన్‌కో కంపెనీకి నీటికేటాయింపుల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానదీయాజమాన్యబోర్డుకు డిపిఆర్ సమర్పించి భాగస్వామ్య రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభిప్రాయం తెలుసుకోకుండా , బోర్డు ఆమోదం లేకుండానే ఏకపక్షంగా ఒటటిఎంసి నీటిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే బోర్డు అనుమతి తీసుకున్నట్టు టీడిపి నేతలు చెబుతున్నారు. మరో వైపు గ్రీన్‌కో ప్రాజెక్టుకు ఒక్క సారి ఒక టిఎంసినీటిని కేటాయిస్తే ఇక అదే నీటితో పదే పదే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నందున ఇందుకు కృష్ణాబోర్డు అనుమతి అంత అవసరం లేదని ఎపి ప్రభుత్వ వర్గాలు సమర్ధించుకుంటున్నాయి. వివాదాస్పద అంశంగా మారిన గ్రీన్‌కో కంపెనీకి నీటికేటాయింపులపట్ల కృష్ణానదీ యాజమాన్యబోర్డు స్పందన ఏమిటన్నది తెలియాల్సివుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News