Tuesday, November 5, 2024

రాష్ట్ర మంతటా పచ్చదనం పెంపును నిరంతరం కొనసాగించాలి

- Advertisement -
- Advertisement -

అన్ని మున్సిపాలిటీలు, కాలనీల్లో విభిన్న రకాల
చెట్లు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
అహ్లాదాన్ని పంచే పూల మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నర్సరీల్లోనే అవసరమైన అన్ని రకాల మొక్కలు పెంచాలి
అధికారులను ఆదేశించిన
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

Greenery enhancement should be continued throughout state

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర మంతటా పచ్చదనం పెంపు కార్యక్రమాలను నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. హరిత వనాల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అరణ్యభవన్‌లో బుధవారం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారని, ఆమేరకు అన్ని శాఖల సమన్యయంతో పనులు చేయాలని ఆమె సూచించారు. అన్ని మున్సిపాలిటీలు, కాలనీల్లో విభిన్న రకాల చెట్లు పెంచేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆమె అధికారులకు సూచించారు. నీడను ఇచ్చే చెట్లతో పాటు, అహ్లాదాన్ని పంచే పూల మొక్కలను కూడా నాటేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

మొదటి దశలో 33 నర్సరీల్లో …

మున్సిపాలిటీలకు అవసరమైన పెద్ద మొక్కలను సరఫరా చేయడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉందని ఆమె తెలిపింది. మొదటి దశలో 33 నర్సరీల్లో పెద్ద మొక్కల పెంపకం జరగనుండగా, ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిపివేయాలని, ప్రభుత్వ నర్సరీల్లోనే అవసరమైన అన్ని రకాల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా కొన్నేళ్లుగా నాటిన మొక్కలు, ఇప్పుడు చెట్లుగా మారి చక్కటి ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. ట్రీ సిటీగా వరుసగా రెండో ఏడాది కూడా హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో అందరి కృషి ఉందని అధికారులు, సిబ్బందిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రశంసించారు.

మొక్కల లక్ష్యాన్ని దశల వారీగా….

పట్టణ ప్రాంతాలకు చేరువలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాల హరితవనాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేయాలని ఆమె కోరారు. హెచ్‌ఎండిఏ 16 హరిత వనాలను, జీహెచ్‌ఎంసి 3, సిడిఎంఏ 5, ఫారెస్ట్ కార్పొరేషన్ 6 హరిత వనాలను అభివృద్ధి చేస్తున్నాయని శాంతికుమారి పేర్కొన్నారు. 55,88,300 మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా ఇప్పటివరకు 32,78,500 పూర్తి చేశామని ఆమె తెలిపారు. మిగతా 23,09,800 మొక్కల లక్ష్యాన్ని దశల వారీగా రానున్న అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో పిసిసిఎఫ్ , హెచ్‌ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, కమిషనర్ సిడిఎంఏ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎం.ప్రశాంతి, అదనపు పిసిసిఎఫ్ వినయ్ కుమార్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, హెచ్‌ఎండిఏ, జీహెచ్‌ఎంసి అధికారులు బి. ప్రభాకర్, వి.కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News