అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా చేపట్టాల్సిన అవసరముంది
పర్యావరణ పనితీరు నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిందే
తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి
భవిష్యత్ తరాలకు మనం నష్టం చేయరాదు
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణకు హరిత హారం కార్యక్రమం మంచి సత్ఫలితాలనిచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 24 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెరగడంలో హరితహారం కార్యక్రమం ఎంతో తోడ్పాటునందించిందన్నారు. హరితహారం అమలుతో ఈ ఎనిమదేళ్ల కాలంలో 8.2 శాతం గ్రీనరీని పెంపొందించుకోగలిగామని చెప్పారు. సిఎం కెసిఆర్ కృషి, పట్టుదల వల్లే ఇదంతా సాధ్యమైందని, తెలంగాణ ఆకుపచ్చగా మారిందన్నారు. పర్యావరణ పనితీరు నివేదికలో భారతదేశం 180వ స్థానంలో నిలవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దీనిపై తగిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. ఎన్విరాన్‌మెంటల్ ఫర్మామెన్స్ ఇండెక్స్2022లో భారతదేశం కేవలం 18.9 స్కోరుతో 180వ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్ తరాలకు మనం నష్టం చేయరాదని కెటిఆర్ వ్యాఖ్యానించారు.