మన దేశ జనాభా శరవేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగవలసిన అవసరం ఉంది. అయితే దేశంలో 90% మంది సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ సంప్రదాయ వ్యవసాయంలో అనిశ్చిత వర్షాలు, కరువులు, వరదలు, ఇతర వాతావరణ వైపరీత్యాలు వలన పంటలను నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పంటల దిగుబడి తగ్గిపోతుంది. వ్యవసాయానికి అవసరమైన నీరు తగ్గిపోవడం వలన పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడం వలన లోతుగా బోర్లు వేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా ఉపయోగించడం వలన నేల సారం తగ్గిపోతుంది. పర్యావరణం కలుషితం అవుతున్నది.
నేల కోత వలన, పంటలను తెగుళ్ళు, వ్యాధులు ఆశించడం వలన పంటల దిగుబడి తగ్గిపోతున్నది. కార్మికుల వేతనాలు పెరగడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు తగినంత అవగాహన ఉండదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన దిగుబడి పెరుగుతుందని రైతులకు తెలియదు. ఈ సవాళ్లను అధిగమించడానికి, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఇందులో గ్రీన్ హౌస్ వ్యవసాయం చెప్పుకోదగినది. గ్రీన్‌హౌస్ వ్యవసాయం అంటే నియంత్రిత వాతావరణంలో పంటలను పండించడం. గ్రీన్‌హౌస్‌లు ఉష్ణోగ్రత, తేమ, ఇతర అంశాలను నియంత్రించడానికి సాంకేతికతను ఉపయోగించి ఆదర్శవంతమైన పరిస్థితులను సృష్టించడం.
ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కట్టడంలో పంటలను పండిస్తారు. ఇది సాధారణంగా గాజు లేదా ప్లాస్టిక్ వంటి పారదర్శక పదార్థాలతో నిర్మించబడి ఉంటుంది. దీని వలన సూర్యరశ్మి లోపలికి ప్రసరించి లోపల వేడిని నిలుపుతుంది. ఈ వేడి వలన మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. గ్రీన్‌హౌస్ వ్యవసాయ ముఖ్య ఉద్దేశం పంటలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులను సృష్టించడం. సూర్యుని కాంతి పైకప్పు ద్వారా లోపలికి ప్రవేశించి భూమిని, మొక్కలను వేడి చేస్తుంది. ఈ వేడిని పైకప్పు బయటికి పోకుండా నిరోధించడం వలన లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియనే గ్రీన్‌హౌస్ ప్రభావం అంటారు. లోపల ఉష్ణోగ్రత, తేమ, కాంతి, గాలి ప్రసరణ వంటి వాతావరణ పరిస్థితులను నియంత్రించే అవకాశం ఉండడం మూలాన పంటలకు అనుకూలమైన పరిస్థితులను కల్పించి దిగుబడి పెరుగుతుంది.
కాలానుగుణ వైవిధ్యాలతో సంబంధం లేకుండా, గ్రీన్‌హౌస్ వ్యవసాయం ఏడాది పొడవునా పంటల సాగును అనుమతిస్తుంది. నియంత్రిత వాతావరణాన్ని అందించడం ద్వారా గ్రీన్ హౌస్‌లలో మొక్కల పెరుగుదలకు అనువైన పరిస్థితులను నిర్వహించవచ్చు. పెరుగుతున్న కాలాన్ని పొడిగించడం ద్వారా మరింత స్థిరమైన, ఊహించదగిన ఆహార సరఫరా నిర్ధారించబడుతుంది. ఇది వాతావరణ అంతరాయాలకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఆఫ్-సీజన్‌లో కూడా రైతులు తమ పంటలను వైవిధ్యపరచగల, మార్కెట్ డిమాండ్‌లను తీర్చగల సామర్థ్యం ఫలితంగా మెరుగైన ఆహార భద్రత ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో నేలకోతకు గురికాదు. పంటలను తెగుళ్ళు, వ్యాధులు, వాతావరణ వైపరీత్యాల నుండి రక్షించవచ్చు. తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
గ్రీన్‌హౌస్ వ్యవసాయం పంట ఉత్పత్తిని పెంచుతుంది. బహిరంగ ప్రదేశంలో పంటలను పండించడం కంటే చదరపు అడుగుకు ఎక్కువ మొక్కలను పెంచవచ్చు. ఇది పంటలకు హాని కలిగించే పక్షులు, ఇతర జంతువుల నుండి పంటలను దూరం ఉంచుతుంది. అధిక విలువైన, వాతావరణ నియంత్రణ అవసరమయ్యే పంటలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని పంటలు గ్రీన్ హౌస్ వాతావరణంలో బాగా పెరుగుతాయి. టమోటాలు, దోసకాయలు, మిరపకాయలు, కరివేపాకు, గులాబీలు, లిల్లీలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పుచ్చకాయలు, ఔషధ మొక్కలు, నారు మొక్కలకు గ్రీన్ హౌస్ వ్యవసాయం మరింత అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ నీరు అవసరమైన వరి పంటకు, ఎక్కువ స్థలం, సూర్యరశ్మి అవసరమైన చెరకు, పత్తి పంటలకు, లోతైన నేల అవసరమైన వేరుశనగ, క్యారెట్ వంటి వాటికి, తక్కువ విలువైన పంటలను గ్రీన్‌హౌస్‌లో పండించడం లాభదాయకం కాదు. ఇటువంటి వాటికి గ్రీన్ హౌస్ వ్యవసాయం అంత ఆచరణీయం కాదు. అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.
గ్రీన్ హౌస్ నిర్మాణం, పరికరాల నిర్వహణకు అధిక పెట్టుబడి అవసరం. చిన్న, సన్నకారు రైతులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. రైతులకు తగిన సాంకేతిక నైపుణ్యాలు లేవు. ఈ రంగానికి సంబంధించి మన దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రీన్ హౌస్ లోపల ఉష్ణోగ్రత, తేమ, కాంతిని నియంత్రించడానికి విద్యుత్, నీరు అవసరం. లోపల తేమ, వెచ్చని వాతావరణం వలన తెగుళ్ళు, వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కావలసిన ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి, కాంతిని అందించడానికి వెంటిలేషన్ కోసం చాలా విద్యుత్తు అవసరం. ఇది శక్తి వినియోగాన్ని పెంచుతుంది. ఇది పర్యావరణానికి హానికి దారి తీయవచ్చు. ఈ సవాళ్లను అధిగమించడానికి, ప్రభుత్వాలు, రైతులు, పరిశోధకులు కలిసి పనిచేయాలి.
మన దేశంలో గ్రీన్‌హౌస్ వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అగ్రదేశాలతో పోల్చితే మన దేశ వాటా ఇంకా పరిమితంగానే ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గ్రీన్‌హౌస్ వ్యవసాయ విస్తీర్ణం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. అధిక పెట్టుబడి పెట్టడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీని వలన రైతులు పూర్తి స్థాయిలో లాభాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ సహకారం మాత్రం అంతంత మాత్రమే ఉంది. పండించిన పంటలను మార్కెట్ చేయడం, విక్రయించడం ఒక సవాలుగా ఉంది. మన దేశంలో గ్రీన్ హౌస్ వ్యవసాయంలో తన వాటాను పెంచుకోవడానికి ఈ సవాళ్ళన్నీ అధిగమించాలి.
ఈ పద్ధతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇంకా అధికంగా ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీ అందించాలి. ముఖ్యంగా, చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. ఈ చర్యల ద్వారా భారత దేశం గ్రీన్‌హౌస్ వ్యవసాయంలో తన వాటాను పెంచుకోవచ్చు. భారతదేశంలో గ్రీన్ హౌస్ వ్యవసాయం భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. గ్రీన్ హౌస్ వ్యవసాయం రానున్న రోజులలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ హౌస్‌లలో సెన్సార్లు, ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడుతుంది.
గ్రీన్ హౌస్ వ్యవసాయం నీటిని ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సుస్థిర వ్యవసాయానికి దోహదం చేస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని పొందడానికి వర్టికల్ ఫార్మింగ్ పద్ధతులు ఉపయోగించబడతాయి. నగరాల్లో గ్రీన్ హౌస్‌లను ఉపయోగించి పంటలను పండించడం పెరుగుతుంది. ఇప్పటికే గ్రీన్ హౌస్ వ్యవసాయం అనేక రాష్ట్రాలలో విస్తరిస్తోంది. కూరగాయలు, పువ్వులు, ఇతర విలువైన పంటలను పండిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, ప్రభుత్వ సహకారం పెరిగితే ఈ రంగం మరింత వృద్ధి చెందుతుంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సమర్థవంతమైన నీటి యాజమాన్యంపై దృష్టి సారించడం ద్వారా పర్యావరణ ప్రభావాలను తగ్గించవచ్చు.
– డి జె మోహన రావు- 94404 85824