మనతెలంగాణ/హైదరాబాద్: చైనా నుంచి హైదరాబాద్‌కు భారీగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విమానానికి సిఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రెన్యూవబర్ ఎనర్జీ సంస్థ గ్రీన్ కో చైనా నుంచి దిగుమతి చేసుకున్న 200 మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విమానాన్ని మంత్రి పరిశీలించారు. గ్రీన్ కో సంస్థ సహ వ్యవస్థాపకులు అనిల్ చలమాలసెట్టి, మహేశ్ కొల్లితో కలిసి మంత్రి విమానంలో కలియ తిరిగారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రీన్ కో ప్రతినిధులు మంత్రి కెటిఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, కొవిడ్ సమయంలో కాన్సంట్రేటర్లు వైరస్ బాధితుల ప్రాణాలను కాపాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్లలను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సరుకుని చైనా నుంచి తెలంగాణకి తీసుకువచ్చేందుకు ఇండిగో సంస్థ సైతం తన ప్యాసింజర్ ఫ్లైట్‌ని ఉపయోగించి తీసుకువచ్చిన ఇండిగో యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Greenko donates 200 Oxygen concentrators to Telangana