పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోగల ఆర్మీ కంటోన్మెంట్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ప్రాణనష్టమేదీ జరగలేదని పోలీసులు సోమవారం తెలిపారు. పఠాన్‌కోట్‌లోని ధీరాపూర్ సమీపంలో ఉన్న కంటోన్మెంట్‌కు చెందిన త్రివేణి ద్వారా ఎదుట మోటారుసైకిల్‌పై వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గ్రెనెడ్ విసిరినట్లు పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు. హ్యాండ్ గ్రెనేడ్‌కు చెందిన కొన్ని భాగాలను ఫోరెన్సిక్ బృందం సేకరించినట్లు వారు తెలిపారు. పేలుడు సంఘటనతో జిల్లావ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై వివిధ ప్రాంతాల వద్ద వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించడానికి మంగళవారం అమృత్‌సర్ సరిహద్దు మండలం, జలంధర్ మండలానికి చెందిన సీనియర్ అధికారులతో సమవేశం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రణధావా సోమవారం వెల్లడించారు. ఐదేళ్ల క్రితం పఠాన్‌కోట్ వైమానికి కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.