Sunday, December 29, 2024

గ్రేహౌండ్స్ భూమి ప్రభుత్వానిదే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :అసైన్డ్ భూముల క్రయ, విక్రయా లు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ ఆంధ్రాకు చెందిన కొందరు నాయకులు భూ దందాను కొనసాగించారు. ఓ మాజీ పోలీసు అధికారి, రాజకీయ అండదండలు కలిగిన వ్యక్తులు ఈ విషయంలో చక్రం తిప్పారు. ఆంధ్రా ల్యాండ్ మాఫియా చేసిన ఆగడాలకు ఎట్టకేటకు చెక్ పడింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని దే శ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మంచిరేవులలోని గ్రే హౌండ్స్ భూమి ప్రభుత్వానిదేనని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.

ఈ తీర్పు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కబ్జాదారులకు చెంపపెట్టుగా నిలిచింది. ఈ భూమి విస్తీర్ణం 143 ఎకరాలు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 వేల కోట్ల పైమాటే. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖకు ( గ్రేహౌండ్స్) కేటాయించిన భూములపై ప్రైవేటు వ్యక్తులకు, జీపీఏ హోల్డర్లకు హక్కుల్లేవని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న 142.39 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని కోర్టు తేల్చి చెప్పింది. 2003 జూన్ మూడో తేదీన మంచిరేవుల్లోని సర్వే నం.393 లోని 183.29 ఎకరాలను గ్రే హౌండ్స్‌కు పంచనామా చేసి అప్పగించారు. అంతకు ముందు 1989లోనే 183 ఎకరాలను కేటాయించారు. అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఆ భూమి ఉంది.

అసైన్డ్ భూములను కొనుగోలు చేసి అత్యంత విలువైన భూమిని హస్తగతం చేసుకునేందుకు ఆంధ్రా నాయకులు, కొన్ని కంపెనీలు చేసిన కుట్రలకు తాజాగా సుప్రీం కోర్టు బ్రేక్ వేయడం గమనార్హం. ఏనాడో రద్దయిన అసైన్మెంట్ భూములపై పెత్తనం చెల్లదని, క్రయ, విక్రయాలు చెల్లవని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం సాగుకు అనుకూలంగా లేని రాళ్లు, రప్పలు, గుట్టలుగా ఉండే భూములను పంపిణీ చేశారు. రియల్టర్లు, అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. అసైన్మెంట్ భూములను జీపీఏ చేయించుకున్నామంటూ వారు పెత్తనం చెలాయించారు. అసైనీలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాగుకు అనుకూలంగా లేని భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని అప్పుడే పోలీసు గ్రేహౌండ్స్ విభాగానికి కేటాయించింది. ఆ తర్వాత అసైన్ దారులు, జీపీఏ హోల్డర్లు భూ కేటాయింపులు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆ చెల్లని జీపిఏ 1997కు సంబంధించి కొందరు అసైన్‌మెంట్‌ల జీపీఏ హోల్డర్లమంటూ రంగప్రవేశం చేశారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రశ్నించారు. చాలా కాలం పలు కేసులు నడిచాయి. ఈ భూమి వివాదంలో అసైన్డ్ జీపీఏ హోల్డర్ అల్లా బక్ష్ అనే వ్యక్తి ప్రవేశించారు. ఆయన 1991 లో డాక్యుమెంట్ నెం.1518 (తేదీ.14.8. 1991) ప్రకారం అమ్మేందుకు, లీజు ఇచ్చేందుకు, మార్టిగేజ్ చేసేందుకు అధికారాలు కట్టబెట్టినట్లు కోర్టుకు పేర్కొన్నారు. అయితే తహసీల్దార్ జారీ చేసిన అసైన్‌మెంట్‌లను, డీఆర్‌ఓ జారీ చేసిన ఉత్తర్వులను పక్కకు పెట్టి మంచిరేవులలోని మొత్తం 142.39 ఎకరాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఆ సమయంలోనే అల్లా భక్ష్ 71 మందికి అమ్మేశారు. దానికి సంబంధించిన క్రయ,విక్రయాలు కొనసాగడంతో వాటి ఆధారంగా కొందరు ఆంధ్రా లీడర్లు, రియల్టర్లు, డెవలపర్స్ రంగప్రవేశం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News