Friday, November 22, 2024

జీరో బిల్లులు జారీ

- Advertisement -
- Advertisement -

అట్టహాసంగా గృహ జ్యోతి ఆరంభం

జీరో బిల్లులు మధిరలో భట్టి, వరంగల్‌లో కొండా సురేఖ
మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క లబ్దిదారులకు అందజేత
మిగతా జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం అట్టహాసంగా ప్రారంభించింది. శుక్రవారం వినియోగదారులకు జీరో బిల్లులు జారీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా గృహ జ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండి, ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి,ప్రజాపాలన సమయంలో పథకానికి దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు నెలవారీ వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో మంత్రులతో పాటు, స్దానిక ఎమ్మెల్యేలు పథకం ప్రారంభించి ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని వాగ్దానం చేశారు.
ఇటీవల రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కలు లాంఛనంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జీరో బిల్ తీసి గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని, విపక్ష పార్టీలు చేసే విమర్శలు నమ్మవద్దని, రాజకీయ లబ్ది కోసం పాకులాడే నాయకులను వచ్చే ఎన్నికల్లో అడ్రస్సు లేకుండా చేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్‌లోని భగత్ నగర్‌లో 200 యూనిట్ల ఉచిత జీరో కరెంట్ బిల్ ను రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ లబ్దిదారులకు జీరో బిల్లు అందచేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద వారి ఇంట్లో ఉచిత కరెంట్ వెలుగులు ప్రసాదించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం గత 27న సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క వివిధ మంత్రుల సమక్షంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు . నిరుపేదల సంక్షేమమే ద్యేయంగా 6 గ్యారంటీలను తీసువచ్చామని , పూర్తి విశ్వాశంతో మమల్ని ప్రజలు ఆదరించారని హర్షం వ్యక్తం చేశారు. గృహ జ్యోతి ఫథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.

విద్యుత్ వినియోగదారులకు తెల్ల రేషన్ కార్డు ఉండి, అర్హులైన వారికి నేటి నుండి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్ అందిస్తున్నామని పంచాయితీ రాజ్, గిరిజన , శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహబూబాబాద్ లో కొత్తగూడ , గంగారాం మండలాల్లో లబ్దిదారులు బిల్లులు అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 6 గ్యారంటీలను నెరవేరుస్తున్నామని అందులో భాగంగా జీరో కరెంట్ బిల్లును స్వయంగా అందచేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గృహ జ్యోతి పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా గృహ జ్యోతి పథకం పొందడానికి అర్హులైన వారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, తమ పరిధిలోని ఎంపిడివో, మున్సిపల్ కార్యాలయాల్లో విద్యుత్ కనెక్షన్ నెంబర్, తెల్ల రేషన్ కార్డుతో అనుసంధానమైన ఆధార్ కార్డుతో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం బావురుగొండలో 100కెవిఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఛార్జ్ చేసి 101 వ్యవసాయ లబ్దిదారులకు విద్యుత్ సరఫరా ప్రారంభించారు. తెలంగాణ రైతు ప్రభుత్వం పాలిస్తుందని పేర్కొన్నారు.

zero bill

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News