శ్యోపుర్: మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో ఉండగానే వరుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన అక్కడి వారిని శోకసంద్రంలో ముంచివేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ జాట్ అనే 27 ఏళ్ల యువకుడు శ్యోపుర్ జిల్లా నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) మాజీ అధ్యక్షుడిగా ఉండేవాడు. అతని అంకుల్ యోగేష్ జాట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రదీప్‌కి శ్యోపుర్‌కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహం నిశ్చయం అయింది. జాట్ హాస్టల్ వేదికగా జరుగుతున్న వివాహ వేడుకల్లో ప్రదీప్ ఉత్సహంగా పాల్గొన్నాడు. బారాత్‌లో అందరితో కలిసి నృత్యం చేశాడు. ఆ తర్వాత అతన్ని గుర్రంపై మండపం వద్దకు తీసుకు వస్తుండగా.. గుర్రంపైనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్నవారు ఇది గమనించి అతనికి వెంటనే సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.