భోపాల్: పెళ్లి మండపంపై కూర్చోవలసిన పెళ్లికొడుకు పోలీసు కస్టడీలో మరణించిన విషాద ఘటన తీవ్ర స్థాయిలో నిరసనలకు, ఆందోళనలకు దారితీసింది. న్యాయం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించిన మృతుడి బంధువులలో కొందరు మహిళలు బహిరంగంగా తమ వస్త్రాలను విసర్జించి నిరసన వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మరికొద్ది సేపట్లు పెళ్లి ఊరేగింపు(బారాత్) ప్రారంభం కావలసి ఉండగా షేర్వానీ ధరించి పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్న 25 ఏళ్ల పార్థీ కులానికి చెందిన దేవ పార్థి అనే యువకుడిని పోలీసులు ఒక చోరీ కేసులో అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళారు.
దేవ పార్థీ గుండెపోటుతో మరనించినట్లు అదే రోజు రాత్రి పోలీసులు అతని బంధువులకు సమాచారం అందచేశారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన పార్థీ బంధువులు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఛాతీ నొప్పి రావడంతో దేవాను మయానా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేశామని, డాక్టర్లు 45 నిమిషాలు సిపిఆర్ చేసినా దేవా బతకలేదని అదనపు ఎస్‌పి మాన్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అయితే తమకు అక్కడ న్యాయం దక్కదని నిర్ణయించుకున్న మృతుడి బంధువులు మంగళవారం కలెక్టరేట్ చేరుకున్నారు.
అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిస్పృహ చెందిన కొందరు మహిళలు తమ వస్త్రాలను తొలగించి వివస్ర్తులై నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేవా పార్థీతోపాటు అరెస్టు చేసిన అతని మామ గంగారాంకు రక్తసిక్త గాయాలయ్యాయని, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేయాలని వారు డిమాండు చేశారు. 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో ఎలా మరణిస్తాడని వారు ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలకే దేవా మరణించాడని వారు ఆరోపించారు. దేవాకు భోపాల్‌లో అటాప్సీ నిర్వహించాలని వారంతా పట్టుపట్టారు.అయితే మెజిస్టీరియల్ దర్యాప్తునకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి హామీ రావడంతో ఆందోళనకారులు శాంతించారు.