న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వినేందుకు ఒక పెళ్లి కొడుకు ఏకంగా పెళ్లి తంతునే నిలిపివేయించాడు. మన్ కీ బాత్ ముగిసిన తర్వాతే ఆ వరుడు వధువు మెడలో తాళికట్టాడు. రాజస్థాన్‌లోని భిల్వారాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. భిల్వారాలోని ఒక ప్రైవేట్ రిసార్టులో ఆదివారం రిషభ్ అనే యువకుడి పెళ్లి జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి వీరభక్తుడైన రిషభ్ మోడీ నెలకోసారి చెప్పే మన్ కీ బాత్‌ను క్రమం తప్పకుండా రిషభ్ వింటాడు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వచ్చే నాడే అతని పెళ్లి జరుగుతోంది. దీంతో కొద్దిసేపు పెళ్లి తంతును పక్కనపెట్టేసి ప్రధాని మోడీ చెప్పే మన్ కీ బాత్ విందామని రిషభ్ పట్టుపట్టాడు. దీంతో చేసేదేమీ లేక వధువు తరఫు పెద్దలు అప్పటికప్పుడు అందుకు తగ్గ ఏర్పాటు చేశారు. అందరూ శ్రద్ధగా మోడీ మాటలు విన్నారు. మోడీ రేడియో ప్రసంగం అయిన తర్వాత రిషభ్ వధువు మెడలో తాళికట్టాడు.
తాను ప్రధాని నరేంద్ర మోడీ వీరాభిమానినని, మోడీ సూచనలు తనకు ఎంతో స్ఫూరిదాయకమని రిషభ్ అంటున్నాడు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పిపోకూడదని భావించానని, అందుకే పెళ్లిని కూడా పక్కనపెట్టేశానని అతను చెప్పాడు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్‌లో తాను ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నానని అతను తెలిపాడు. తాను నవవధువు అంజలి, ఆమె కుటుంబ సభ్యులందరితో కలసి మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వినడం చాలా ఆనందంగాఉందని, తన నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారంటూ రిషభ్ మీడియాకు తెలిపాడు.
Also Read: స్వగతం కాదు.. కర్నాటకకు ఏం చేశారో చెప్పండి: మోడీకి రాహుల్ హితవు