రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్ మార్కుల వివరాలను టిజిపిఎస్‌సి సోమవారం ప్రకటించనున్నది. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టిజిపిఎస్‌సి తుది పరిశీలన కొనసాగిస్తోంది. ముందుగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలలో అభ్యర్థుల మార్కులను వెల్లడించి, ఆ తరువాత అభ్యంతరాలున్న వారి నుంచి రీ కౌంటింగ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను కమిషన్ వెల్లడించనుంది. కాగా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్- 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరుకాగా,
ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. 2011 సంవత్సరం తర్వాత జరుగనున్న గ్రూప్ -1 ఫలితాలు విడుదల కానున్నాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లోనే 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా గ్రూప్- 1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్ధయింది. ఆ నోటిఫికేషన్‌కు మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి ప్రధాన పరీక్షలు జరుగగా, సోమవారం అభ్యర్థులు పొందిన ప్రొవిజినల్ మార్కుల జాబితాను టిజిపిఎస్‌సి ప్రకటించనున్నది.