Monday, December 23, 2024

గ్రూప్ 1 పరీక్షలను సజావుగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై అధికారులు వారి వారి విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి, ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులకు కలెక్టర్ పరీక్షల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకే ఎన్నో పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉన్న ప్రతీ పరీక్షను మొదటి పరీక్షగా భావించి, ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అవగతం చేసుకొని సజావుగా జరిగేలా చూడాలన్నారు.

గోడ గడియారాలకు అనుమతి లేదని, ప్రతి అర గంటకు ఒక బెల్లు చొప్పున కొట్టాలన్నారు. ఇన్విజిలేటర్లు, ప్రెస్కింగ్ బాధ్యులు, టాయిలెట్/త్రాగునీటి బాధ్యుల జాబితా సమర్పించాలన్నారు. మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్షా గదులు, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని, అన్ని సిసి కెమెరాలు పనిచేయు స్థితిలో ఉండేట్లు చూసుకోవాలని ఆయన తెలిపారు. టాయిలెట్ సైన్ బోర్డులు, పరీక్షా కేంద్రం లే అవుట్ మ్యాపులు ప్రదర్శించాలన్నారు. ఉదయం 9.30 గంటల కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రం చేరుకోవాలని, పరీక్షా సమయం మధ్యాహ్నం. 1.00 వరకు అని, అభ్యర్థులు ఎవరినీ బయటకు వెళ్లుటకు అనుమతించరని ఆయన అన్నారు.

అభ్యర్థులు హాల్ టికెట్టులను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగా పరీక్షా కేంద్రం చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రానికి బూట్లు వేసుకొని రావద్దని, చెప్పులు వేసుకొని రావాలని ఆయన సూచించారు. జిల్లాలో 17,366 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నట్లు, 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. 11 రూట్లు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థుల సౌకర్యం కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎండాకాలం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదన్నారు.

ఏ దశలో తప్పిదాలకు తావులేకుండా విజయవంతంగా పరీక్ష చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News