టాప్ టెన్‌లో ఆరుగురు మహిళలు
గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్
జాబితా విడుదల 12,622 మంది
ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో
పెట్టిన టిజిపిఎస్‌సి త్వరలో
ధ్రువపత్రాల పరిశీలన
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ జాబితా(జిఆర్‌ఎల్)ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో తమ ర్యాంకులను చూసుకోవచ్చని కమిషన్ వెల్లడించింది. ఈనెల 10వ తేదీన గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసిన కమిషన్, తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహంచిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ముందుగా మార్కుల వివరాలను ప్రకటించి తర్వాత జిఆర్‌ఎల్‌ను ప్రకటించారు.గ్రూప్ 1 అభ్యర్థుల మార్కులను ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులు మినహా మిగతా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను టిజిపిఎస్‌సి విడుదల చేసింది.
మొదటి 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలే
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మహిళలు సత్తా చాటారు. 900 మార్కులకుగాను 550 మార్కులతో జనరల్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలిచారు. తొలి స్థానంతో పాటు మొదటి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు బిసి అభ్యర్థులు ఉండగా, మిగిలినివారంతా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులే ఉన్నారు. టాప్ టెన్‌లో ఆరుగురు మహిళలు ఉండగా, నలుగురు పురుష అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 563 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరిగిన గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి అర్హత సాధించిన 12,622 మంది ర్యాంకులను టిజిపిఎస్‌సి ఆదివారం విడుదల చేసింది.
టాప్ 100లో 59 మంది పురుషులు
గ్రూప్ 1 మెయిన్స్ మార్కులు పొందిన వారిలో టాప్ 100లో 59 మంది పురుషులు ఉండగా, 41 మంది మహిళలు ఉన్నారని తెలిపింది.వారిలో 32 మంది ఒసిలు, 48 మంది బిసిలు, ముగ్గురు ఎస్‌సిలు, ఐదుగురు ఎస్‌టిలు, 12 మంది ఇడబ్లూఎస్ అభ్యర్థులు ఉన్నారని పేర్కొంది. అదేవిధంగా టాప్ 500లో 296 మంది పురుషులు, 204 మంది మహిళలు ఉన్నార, వారిలో 132 మంది ఒసిలు, 228 మంది బిసిలు, 50 మంది ఎస్‌సిలు, 38 మంది ఎస్‌టిలు, 52 మంది ఇడబ్లూఎస్ అభ్యర్థులు ఉన్నారని పేర్కొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం మెరిట్ జాబితా నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.
త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తాం
గ్రూప్ 1 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలోనే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టిజిపిఎస్‌సి తెలిపింది. అభ్యర్థులకు వ్యక్తిగతం సమాచారం సైతం ఇస్తామని కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే.. అభ్యర్థులు పనిదినాలలో 040 -23542185/040- 23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని కమిషన్ సూచించింది.
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి గ్రూప్- 1 పరీక్షలు ఇవే కావటం గమనార్హం. ఇప్పటికే కోర్టు కేసులు, పేపర్ లీకేజీతో పలు మార్లు వాయిదా పడిన గ్రూప్ -1 పరీక్షల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు గతంలోనే టిజిపిఎస్‌సి ప్రకటించింది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు హెచ్‌ఎండిఎ పరిధిలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగగా, నవంబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు పారదర్శకంగా పకడ్భందీగా జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహించినట్లు వివరించింది.
గ్రూప్ 1 మెయిన్స్‌లో అర్హత పరీక్ష(ఇంగ్లీష్) పేపర్ 0లో అత్యధికంగా 139.5 మార్కులు రాగా, పేపర్ 1లో 97.5 మార్కులు, పేపర్ 2లో 102.5, పేపర్ 3లో 102.5, పేపర్ 4లో 113.5, పేపర్ 5లో 96.5, పేపర్ 6లో 100 మార్కులు వచ్చినట్లు కమిషన్ వెల్లడించింది. మొత్తం 20161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకాగా, వారిలో 12323 మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, 7829 మంది తెలుగు మీడియం, తొమ్మిది మంది ఉర్దూ మీడియం అభ్యర్థులు ఉన్నారని తెలిపింది. కాగా, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే ఎక్కువ మార్కులు వేశారని, తెలుగు మీడియం విద్యార్థులకు తక్కువ మార్కులు వేశారని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే.