Monday, January 20, 2025

నేడే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

అన్ని ఏర్పాట్లు చేసిన కమిషన్
563 పోస్టులు…4.03 లక్షల మంది దరఖాస్తు
31 జిల్లాలు…. 897 ఎగ్జామ్ సెంటర్లు
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి అభ్యర్థికి యూనిక్ ఓఎంఆర్ షీట్‌ను ఇవ్వనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 897 ఎగ్జామ్ సెంటర్లను కమిషన్ ఏర్పాటు చేసింది.

ప్రతి కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుందని, ప్రతి ఐదు సెంటర్లకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంటుందని కమిషన్ తెలిపింది. ప్రతి ఇరవై సెంటర్లకు ఒకరి చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. దీంతోపాటు అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లేటప్పుడు వారి హాల్ టికెట్, ఆధార్ కార్డులను వివరాలతో పోల్చి చూసేందుకు వీలుగా ప్రతి వంద మందికి ఒకరి చొప్పున ఎగ్జామినర్లను నియమించింది. పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతున్నందున సరిగ్గా పది గంటలకే సెంటర్ల మెయిన్ గేట్స్ క్లోజ్ అవుతాయని, ఆ తర్వాత ఎవ్వరినీ లోపలికి అనుమతించబోమని గతంలోనూ స్పష్టం చేసిన కమిషన్ తాజాగా మరోసారి పేర్కొంది.

అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు

ఇప్పటికే సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు ఫొటోను అంటించాలని, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో దాని కింద సంతకం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షల్లో కాపీయింగ్, మాల్ ప్రాక్టీసు లాంటివి చోటుచేసుకోకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేశామని, పేపర్ లీకేజీ లాంటివి జరగకుండా సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు చుట్టూ పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్‌ను తీసుకోవడంతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సిసి టివిల నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరీక్షలకు సంబంధించి ఏ సందేహాలున్నా నివృత్తి చేయడానికి అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105 సెంటర్‌లు

రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరీక్షలు రాస్తున్నందున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105 సెంటర్‌లను, రంగారెడ్డి జిల్లాలో 93 సెంటర్లను, హైదరాబాద్‌లో 77 సెంటర్లను నెలకొల్పినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఖమ్మం జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 47 చొప్పున అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ సెంటర్లను నెలకొల్పామని కమిషన్ వివరించింది.

అతి తక్కువగా భువనగిరి జిల్లాలో 9 సెంటర్లు, మెదక్‌లో 10, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 12 చొప్పున, నిర్మల్ జిల్లాలో 13 సెంటర్లను నెలకొల్పింది. పరీక్షా కేంద్రాల్లోకి వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, లాగరిథమ్ బుక్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను అనుమతించడం లేదని తెలిపింది. వీటిని తీసుకొచ్చినా ఎగ్జామ్ సెంటర్ బయటే ఉంచాలని, కానీ, ఎలాంటి క్లాక్ రూమ్‌లు ఏర్పాటు చేయనందున అభ్యర్థులు గమనంలో ఉంచుకోవాలని కమిషన్ పేర్కొంది.

1.70 లక్షల మంది అభ్యర్థుల కోసం బస్సుల ఏర్పాటు

మరోవైపు ఆర్టీసి కూడా అదనపు బస్సు సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు రద్దీ ఎక్కువగా ఉన్నందున ఎంజీబిఎస్, జేబిఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల దగ్గర తగిన ఏర్పాట్లు చేసింది. బస్సు స్టేషన్‌లలో హెల్ప్ సెంటర్లను నెలకొల్పినట్లు ఆర్టీసి యాజమాన్యం తెలిపింది. పరీక్షా కేంద్రాల వివరాలను, దానికి తగినట్లుగా బస్సులు ఏ సమయంలో ఏ రూట్లో బయలుదేరుతాయో అభ్యర్థులకు వివరాలను ఈ సెంటర్లు అందజేస్తాయని ఆర్టీసి అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 1.70 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నందున సిటీ బస్సులను కూడా సంఖ్యాపరంగా ఆర్టీసి ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News