- 869.07 శాతం మంది హాజరు
- 8పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
సూర్యాపేట: జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
పరీక్షా కేంద్రాలలో ప్రాథమిక వసతి ఉందా లేదా అని గమనించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతి లేనందున అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.
కాగా ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా జరిపిన వేలిముద్రల సేకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ ఆరా తీసారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 69.07 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 9170 మందికి గాను 6334 మంది పరీక్ష రాయగా, 2836 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు ఉన్నారు.