Friday, January 17, 2025

తొలిరోజు పరీక్ష ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

గ్రూప్2 పరీక్షకు 46శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాల
వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన
టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం సినిమాలపై
ప్రశ్నలు మధ్యస్థంగా పేపర్1, కఠినంగా పేపర్2
వికారాబాద్‌లో ఫోల్డబుల్ ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షలు తొలి ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 5,51,855 మంది అభ్యర్థులు గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకోగా, ఉదయం జరిగిన పేపర్ 1కు 2,57,981 మంది (46.75 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కు 2,55,490 మంది (46.30 శాతం) హాజరయ్యారు. తొలి రోజు సగానికిపైగా అభ్యర్థులు పరీక్షలకు గైర్హారజయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు.

పరీక్షా కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్ జరుగగా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 783 పోస్టులకు 33 జిల్లాల్లోని 1,368 పరీక్షా కేంద్రాలు, 58 ప్రాంతీయ కేంద్రాలలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 4 పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లను చేసింది. పరోక్షంగా 75 వేల మంది వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. గ్రూప్-2 పరీక్షకు దాదాపు 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్ -2 పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన టిజిపిఎస్‌సి ఛైర్మన్

బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్ -2 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా ఏళ్ల తరవాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ఇస్తామని పేర్కొన్నారు. నాలుగుసార్లు వాయిదా పడ్డ తరవాత ఈసారి పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2కు హాజరయ్యాని వివరించారు.

ఫోల్డబుల్ మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డ అభ్యర్థి

గ్రూప్ 2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి ఫోల్డబుల్ మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డారు. శ్రీసాయి డెంటల్ కాలేజీ సెంటర్(ఎగ్జామ్ కోడ్ నెం.4419)లో ఓ అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపిచండంతో ఆ పరీక్షా కేంద్రం ఛీఫ్ సూపరింటెండెంట్ అతనిని పూర్తిగా తనిఖీ చేయగా, అతను లోదుస్తుల్లో ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ పెట్టుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ అభ్యర్థిని పరీక్ష రాయకుండా కట్టడి చేసి, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఆ అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సినిమాలపై ప్రశ్నలు

గ్రూప్ 2 పరీక్షలలో ఉదయం జరిగిన పేపర్ 1 జనరల్ స్టడీస్ ప్రశ్నాపత్రంలో సినిమాలపై పలు ప్రశ్నలు వచ్చాయి. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి, ఆస్కార్ పురస్కారాలు 2024కు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, రీజనింగ్, ఇంగ్లీష్ విభాగాల్లో ప్రశ్నలు వచ్చాయి. జత పరచడం విధానంలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, సరైనవి కానివిలో ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 హిస్టరీ, పాలిటీ ప్రశ్నాపత్రంలో డాటా, కాంబినేషన్ ప్రశ్నలు వచాయని తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి సమయం ఎక్కువగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా పేపర్ 1 మధ్యస్థంగా ఉండగా, పేపర్ 2 మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News