హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రభుత్వం న్యూ ఇయర్ కానుక అందించింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 783 పోస్టులు గ్రూప్- 2 ద్వారా భర్తీ చేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటన ద్వారా కమిషనర్ గ్రేడ్ -3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. గతంలో 1,032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన కమిషన్… ఆ స్థాయిలో మళ్లీ ఉద్యోగ ప్రకటన ఇవ్వడం ఇదే ప్రథమం. 2023 జనవరి 18 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 503 గ్రూప్ -1, 9,168 గ్రూప్- 4 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా.. మెయిన్స్ ఎంపికైన జాబితా కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గ్రూప్- 4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30కి వాయిదా వేసింది. గ్రూప్ 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్ -2, 3 కేటగిరీ పరిధిలోకి మరిన్ని ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను చేర్చడంతో ఆ మేరకు అదనంగా పోస్టులను గుర్తించి, వాటిని ప్రస్తుత ప్రకటనల్లో టిఎస్‌పిఎస్‌సి. గ్రూప్ -2 కింద తొలుత 663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా, అదనంగా చేర్చిన పోస్టులతో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 783కి చేరింది. గ్రూప్ -3 కింద అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. సాంకేతిక పొరపాట్లు, న్యాయ, విద్యార్హతల వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే ప్రకటనలను జారీ చేయనున్నట్లు సమాచారం.
క్రమ.సంఖ్య పోస్టు పేరు ఖాళీల సంఖ్య
1. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 11
2. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59
3. నయబ్ తహసీల్దార్ 98
4. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 14
5. అసిస్టెంట్ రిజిస్ట్రార్ 63
6. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 09
7. మండల్ పంచాయత్ ఆఫీసర్ 126
8. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 97
9. టెక్స్‌టైల్ విభాగంలో అసిస్టెంట్ డవలప్‌మెంట్ ఆఫీసర్ 38
10. జిఎడిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 165
11. లిజిస్లేటివ్ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 07
12. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 25
13. న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 07
14. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 02
15. జువైనల్ కరెక్షనల్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11
16. అసిస్టెంట్ బిసి డవలప్‌మెంట్ ఆఫీసర్ 17
17. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 09
18. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 17
………………………………………………………………………………………..