Wednesday, March 12, 2025

గ్రూప్ -2 ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షల నిర్వహణ
600 మార్కులకు 447.088 మార్కులతో
తొలి ర్యాంకు సాధించిన వెంకట హర్షవర్దన్
టాప్ 31 ర్యాంకులలో అందరూ అబ్బాయిలే
లక్కిరెడ్డి వినిషారెడ్డికు 32వ ర్యాంకు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -2 ఫలితాలు విడుదల అయ్యాయి. 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా, ఫైనల్ ‘కీ’ని టిజిపిఎస్‌సి సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితాను టిజిపిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరించారు. కమిసన్ వెబ్‌సైట్‌లో గ్రూప్ 2 ఒఎంఆర్ షీట్లు ఉంచింది.

783 గ్రూప్ 2 ఉద్యోగాలకు భర్తీకి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 50 శాతానికి పైగా గైర్హాజరయ్యారు. నాలుగు పేపర్లకు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో 13,315 మందిని ఇన్‌వ్యాలిడేటెడ్‌గా ప్రకటించి, తాజాగా 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితా(జిఆర్‌ఎల్)ను టిజిపిఎస్‌సి విడుదల చేసింది. జిఆర్‌ఎల్ ఆధారంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. వారికి వ్యక్తిగతంగా, టిజిపిఎస్‌సి వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందిస్తారు. అందువల్ల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పేర్కొన్న ప్రకారం, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి.

టాప్- 31 ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే

గ్రూప్ -2 పరీక్ష ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. నాలుగు పేపర్లకు గానూ మొత్తం 600 మార్కులకు పరీక్షలు జరగగా, నారు వెంకట హర్షవర్దన్ అనే విద్యార్థి 447.088 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. అలాగే వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు, బి. మనోహర్ రావు మూడో ర్యాంకులతో సత్తా చాటారు. టాప్- 31 ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే ఉండటం గమనార్హం. లక్కిరెడ్డి వినిషారెడ్డి 408.713 మార్కులతో 32వ ర్యాంకు పొందారు. ఆ తర్వాత బైకాడి సుస్మిత 41వ ర్యాంకు, కొప్పు శ్రీవేణి 69వ ర్యాంకు, వీరంరెడ్డి శ్రీలత 113వ ర్యాంకు, బైళ్ల శ్రావణి 126వ ర్యాంకు, ఎరవడ్డ నిఖిత 144వ ర్యాంకు, శ్రవంతి లింగం 152వ ర్యాంకు, మిల్కురి సాయిచందన 162వ ర్యాంకు, దరావత్ అనూష 163వ ర్యాంకు సాధించారు.

టాప్ -10 ర్యాంకర్లు వీరే

1. నారు వెంకట హర్షవర్దన్ (447.088 మార్కులు) ఒసి
2. వడ్లకొండ సచిన్ (444.754 మార్కులు) ఒసి
3. బి. మనోహర్‌రావు (439.344 మార్కులు) బిసి డి
4. శ్రీరామ్ మధు (438.972 మార్కులు) బిసి బి
5. చింతపల్లి ప్రీతమ్ రెడ్డి (431.102 మార్కులు) ఒసి
6. అఖిల్ ఎర్రా (430.807 మార్కులు) ఒసి
7. గొడ్డేటి అశోక్ (425.842 మార్కులు) బిసి బి
8. చిమ్ముల రాజశేఖర్ (423.933 మార్కులు) ఒసి
9. మేకల ఉపేందర్ (423.119 మార్కులు) బిసి డి
10. కరింగు నరేష్ (422.989 మార్కులు) బిసి బి

14న గ్రూప్ 3 ఫలితాలు

రాష్ట్రంలో గ్రూప్స్ ఫలితాల వెల్లడికి రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 14న గ్రూప్- 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను టిజిపిఎస్‌సి వెల్లడించనుంది. వీటితో పాటుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈనెల 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితా ఈనెల 19న ప్రకటించనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్- 1 ఉద్యోగాలు, 783 గ్రూప్ -2, 1,365 గ్రూప్ -3 పోస్టులతో పాటు 581 వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News