Wednesday, January 22, 2025

గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: జిల్లాలో జులై -1 న నిర్వహించే గ్రూప్ -4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లతో కలిసి జిల్లాలో జులై -1 న నిర్వహించు గ్రూప్ -4 పరీక్ష సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జులై -1 న టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నిర్వహించే గ్రూప్-4 పరీక్షకు జిల్లాలో టి.ఎస్.పి.ఎస్.సి నియమ, నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అభ్యర్థులు సజావుగా పరీక్షలు వ్రాసే విధంగా చూడాలని, ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. జులై -1 న ఉదయం 10 గంటల నుండి మధ్యా హ్నం 12-30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందని, జిల్లాలో మొత్తం 14 వేల 11 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఇందుకు గాను 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

టి.ఎస్.పి.ఎస్.సి. గైడ్ లైన్స్ ను ప్రతి ఒక్కరూ చదివి, నిబంధనలు పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సందర్శించి త్రాగునీటి, విద్యుత్, సీటింగ్, సి.సి. కెమెరాల ఏర్పాటును, ఇతర మౌళిక వసతు లను సరి చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తహసిల్దార్ లకు సూచించారు.

పరీక్ష కేంద్రంలో టిఎస్‌పిఎస్‌సి గైడ్ లైన్స్ పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ లు దే నని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఆశ, ఒక ఏ.ఎన్.ఎం. లను ఉంచాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్ళే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల కు అనుమతి లేదని, ఆభరణాలు ధరించి రావద్దని, పరీక్ష రోజు చెప్పులు ధరించాలని తెలిపారు. గ్రూప్స్ పరీక్ష నిర్వహణ అత్యంత పటిష్టంగా జరగాలని, చిన్న తప్పుకు కూడా ఆస్కారం ఉండవద్దని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో హాజరయ్యే ప్రతి విద్యార్థి ప్రశాంతంగా నిబంధనల ప్రకారం పరీక్ష రాసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు ఉండాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెల్ ఫోన్ వంటి పరికరాలు భద్రపరుచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసివేయాలని, ఉదయం జరిగే పరీక్షకు 8 గంటల నుంచి 9.45 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1 గంట నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రం గేటు మూసినా తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుండి నిబంధనలు పాటిస్తూ తరలించాలని అన్నారు. గ్రూప్ 4 ప్రశ్నాపత్రాల కవర్ ను ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు చీఫ్ సూపరింటెండెంట్ సమక్షం లో ఓపెన్ చేయాలని, పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్లు ప్రతి అభ్యర్థి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నారో లేదో చెక్ చేసుకోవాలని, ప్రతి అభ్యర్థికి నిర్దేశించిన జవాబు పత్రం, ప్రశ్నాపత్రం అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

పరీక్షా సమయం పూర్తి అయ్యేవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోనే ఉండేలా చూడాలన్నారు. టిఎస్‌ఆర్‌టిసి అధికారులు విద్యార్థుల కు సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడుపాలని సూచించారు. పరీక్ష లు జరుగుతున్నంత సేపు విద్యుత్ అంతరాయం జరగకుం డా చర్యలు తీసుకోవాలని సెస్ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద, ప్రశ్నా పత్రాలు తరలిస్తున్న సమయంలో పోలీసు లు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.

ముందుగా అదనపు కలెక్టర్ కుమార్ ఎన్ ఖీమ్యా నాయక్ చీఫ్ సూపరింటెండెంట్, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు పరీక్ష రోజు చేయవలసిన విధి, విధానాలను క్షుణ్ణంగా వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సీటింగ్ , రూమ్ వారీగా అభ్యర్థుల కేటాయిం పు, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య,జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.ఓలు, చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్ ఆఫీసర్ లు, రూట్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News