- 118 సెంటర్లలో హాజరు కానున్న 53,213 మంది అభ్యర్థులు
నల్గొండ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష ఉదయం 10 నుండి 12.30 వరకు , మధ్యాహ్నం 2-.30 నుంచి 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా జరగనుంది. జిల్లాలో 188 పరీక్షా కేంద్రాలలో 53,213 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నల్గొండ డివిజన్‌లో 110 పరీక్ష కేంద్రాల్లో 32,117 మంది, మిర్యాలగూడ డివిజన్‌లో 60 పరీక్ష కేంద్రాల్లో 16,152 మంది, దేవరకొండ డివిజన్‌లో 18 పరీక్ష కేంద్రాల్లో 4,944 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
పరీక్షా నిర్వహణకు 38 రూట్లు ఏర్పాటు చేయగా, రూట్ అధికారులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలను, జిల్లా అధికారులను నియమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనుండగా అభ్యర్థులు పరీక్ష సమమానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. సెల్ ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
అభ్యర్థులు పరీక్షకు కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపారు. గ్రూప్-4 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా పరీక్ష కే ంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షలు సజావుగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 42 మంది ఎస్‌ఐలు, 427 మంది కానిస్టేబుల్స్ బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 6గంటల ను ండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ అన్ని మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.