Saturday, November 23, 2024

తాళిబొట్టు, మెట్టెలు తీయక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం రాత్రి వరకు 9,01, 051 మంది శాతం) అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. నేపథ్యంలో అ భ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం ఎలా ఉండబోతుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 40వేల గదు ల్లో అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ముమ్మర ఏర్పాట్లను చేసింది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డిజిపి, జిల్లా ఎస్‌పిలతో కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది.

అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాలను చేరుకోవాలి
గ్రూప్-4 పరీక్ష విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. అందువలన అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కమిషన్ సూచించింది.
ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అధికారి నియామకం
అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో డబుల్ బబ్లింగ్ చేయకుండా టిఎస్‌పిఎస్‌సి సంబంధిత సూచనలను ఎస్‌ఎంఎస్ రూపంలో అభ్యర్థులకు చేరవేసింది. వాటితో పాటు బబ్లింగ్ లోపాలను వివరాలతో కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇది అభ్యర్థులు గమనించాలని సూచించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అధికారిని కమిషన్ నియమించింది. ఆ అధికారి పర్యవేక్షణలో.. అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్‌టికెట్, అందులోని పేరు, ఫొటో గుర్తింపు కార్డు, మిగతా వివరాలను పరిశీలించి అనుమతించనున్నారు. పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరం పరీక్ష గదుల్లోకి పంపిస్తారు. తనిఖీ సమయంలో అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని పబ్లిక్ సర్వీస్ సూచించింది. అభ్యర్థులు తీసుకువచ్చిన ఫొటో గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌లోని సంతకాలు.. నామినల్ రోల్‌లో పెట్టే సంతకంతో సరిపోలాలని పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లు.. హాల్‌టికెట్, గుర్తింపు కార్డుల్లోని ఫొటో, నామినల్ రోల్.. పరిశీలించి అభ్యర్థి గుర్తింపును ధ్రువీకరిస్తారు.

పరీక్షా కేంద్రాలైన విద్యాసంస్థలకు నేడు సెలవు
గ్రూప్ 4 పరీక్ష శనివారం(జులై 1) నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ రోజు పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించే 2,878 కేంద్రాలకు సంబంధించిన విద్యాసంస్థలకు మాత్రమే శనివారం సెలవు ఉంటుంది. అదే రోజు పాలిటెక్నిక్ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షలున్నందున వాటిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఆ రోజు జరగాల్సిన పరీక్షను జులై 15వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు
గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థినులు తాళిబొట్టు, మెట్టెలు తీయాలని టిఎస్‌పిఎస్‌సి ఎక్కడా పేర్కొనలేదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించే తనిఖీలలో భాగంగా తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇవీ సూచనలు
1. గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

2. పేపర్ -1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్- 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అందువల్ల పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్- 2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో చేరుకోండి.

3. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

4. అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్ధిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.

5. ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. నామినల్ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

6. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఒఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్ మోగిస్తారు.

7. అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదు. గ్రూప్-4 ఒఎంఆర్ పత్రంలో హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబరు, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలి.

8. ఓఎంఆర్ పత్రంలో బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నెంబరు రాయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News