Sunday, December 22, 2024

గ్రూప్ 4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో జులై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలను అత్యంత పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ పరీక్ష నిర్వాహణ అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16 వేల 637 మంది అభ్యర్థులు గ్రూప్ 4 పరీక్షలను రాస్తున్నందున వారి కోసం జిల్లాలోని 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

పేపర్ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నిమిషాల ముందుగానే గేట్లను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఐడి కార్డ్, హాల్ టికెట్‌లు లేకుండా అభ్యర్థులను అనుమతించవద్దని సూచించారు. అభ్యర్థులు బూట్లు, బెల్ట్, ఎలక్ట్రానిక్ పరికరాలు ధరిస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలతో లైవ్ టెలికాస్ట్ ద్వారా రికార్డు చేయాలని ఆదేశించారు. 50 పరీక్ష కేంద్రాల్లో కొనసాగే పరీక్షల ప్రక్రియను జిల్లా కేంద్రం నుంచి నేరుగా ప్రత్యక్షంగా పరీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు ముందుగా సందర్శించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నీచర్, సిసి కెమెరాల పనితీరును పర్యవేక్షించాలన్నారు.

పరీక్ష జంబ్లింగ్ పద్ధతిన నిర్వహించనున్నందున అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పరీక్ష సమయం ముగిసే 15 నిమిషాల ముందు అభ్యర్థి ఎడమ వేలిముద్ర నామినల్ రోల్‌పై తీసుకోవాలని సూచించారు. 396 మంది దివ్యాంగులు పరీక్షలకు హాజరు కానున్నారని. దివ్యాంగులకు భవనంలోని కింది ఫ్లోర్‌లో ఉన్న గదులను కేటాయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నందున సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని, అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి పంపాలన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో 18 పరీక్ష కేంద్రాలు, బిజినేపల్లిలో 3, బల్మూర్‌లో 2, అచ్చంపేటలో 8, పెద్దకొత్తపల్లిలో 1, కల్వకుర్తిలో 11, వెల్దండలో 1, తెలకపల్లిలో 4, తిమ్మాజిపేటలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లకు తావివ్వకుండా గ్రూప్ 4 పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఏ చిన్న పొరపాట్లు జరిగినా సంబంధిత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పైనే పూర్తిస్థాయి బాద్యత ఉంటుందని, అందుకు తగ్గట్లుగా పరీక్ష కేంద్రంలో విధులు వ్యవహరించాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నిర్ణిత గడువులో సిసి కెమెరాలు రికార్డుతో పరీక్ష ప్రశ్నా పత్రాలు ఇద్దరు విద్యార్థుల సమక్షంలో ఓపెన్ చేసి ఆ విద్యార్థుల సంతకం తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, ఏఎస్పి ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, జిల్లా అధికారులు, ఆర్డిఓలు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, లైజన్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News