కోటగిరి : నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేసి వారికి చేరువకావాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. గ్రూపు తగాదాలతో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పాటైన పోతంగల్ మండల కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించనున్న నూతన మండల కాంప్లెక్స్ భవనానికి స్పీకర్ భూమి పూజచేసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడంలో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. పరిపాలించే రాజు బాగుంటే ప్రజలు బాగుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పక్కనే గల మహారాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వల్లేపల్లి సునీత శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచు వర్ని శంకర్, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, ఎంపిటీసీలు కేశ వీరేశం, అనంత విఠల్, జడ్‌పిటిసి శంకర్ పటేల్ , మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.