ఫలిస్తున్న అధికారులు ప్రయత్నాలు
త్వరలో పూర్వవైభోగం వస్తుంది
దీమా వ్యక్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా క్రమంగా ప్రయాణికులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థ ఆక్యుపెన్సీరేషియో పెరగడంతో సంస్థ ఆదాయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఎండిగా బాధ్యతలు స్వీకరించిన ఎండి సజ్జన్నార్ గ్రేటర్‌లో ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టించారు. ఇందులో భాగంగా బస్సులు సమయానికి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, ప్రయాణికులు తాము కోరుకున్న ప్రాంతాల్లోనే ఆపేలా చేయడంతో పాటు , రద్దీ అధికంగా లేని ప్రాంతాల్లో బస్సుల టిప్పుల సంఖ్యను తగ్గించి ఇతర ఆదాయం వచ్చే మార్గంలో తిప్పడం వంటి చర్యలు తీసుకున్నారు. శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారి కోసం, అదే విధంగా నగరం నుంచి శివారు ప్రాంతాలకు వెళ్ళే వారిని దృష్టిలో బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణించడం ద్వారా ప్రయాణికులకు కలిగే లాభాలను వివరించేందుకు బస్సుతో భరోసా వంటి ప్రకటనలతో ప్రయాణికులను ఆకర్షిండమే కాకుండా , ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం ద్వారా కలిగే నష్టాలను కూడా అధికారులు వివరిస్తున్నారు.
దీంతో ప్రయాణికులు ప్రైవేట్ రవాణా వ్యవస్థ అయిన ఆటోలు,సెట్విన్‌లు, క్యాబ్‌లను ఆశ్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో, దిగే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు దిగాల్సిన స్టేజీలను గుర్తు చేసి మరీ వారిని దించేస్తున్నారు. ప్రయాణికులు అడిగే స్టాప్‌ల వివరాలను, బస్సులు వచ్చే సమయాలను వారికి ఓపిగ్గా వివరిస్తూ మార్గదర్శకం చేస్తున్నారు. బస్సులు సరిగ్గా బస్‌బేలో ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌టిసి బస్సులకు అడ్డుంగా ఉండి ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు. దిగేందుకు అడ్డు వస్తున్న ఆటోలు,ఇతర వాహనాలపై కూడా చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడంటం లేదు. బస్టాపుల్లో ఎక్కడా ఆటోలు ఆగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా నడిరోడ్డుపై బస్సును ఆపి ఆపనట్లు తీసుకెళ్ళే డ్రైవర్లపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దపడుతున్నారు.. డిపోల మేనేజర్లతో నిరంతరం మాట్లాడుతూ బస్సులు సరైన సమాయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విధంగా ఆర్టిసి అధికారులు ప్రయాణికులను ఆకర్షిస్తూ వారిని తిరిగి గతంలో మాదిరిగా ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వైపు రోజు రోజుకు డీజిల్,పెట్రోల్ ధరలు పెరుగుతుండంతో అనేక మంది వాహనదారులు తమ వ్యక్తగత వాహనాలను వదిలి ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించడంతో కూడా ఆర్‌టిసి ఆదాయం పెరిగేందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతి ఎండి సజ్జన్నార్ తరచు బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులు భరోసా కల్పిస్తుండటం వంటి చర్యలు సంస్థ ఓర్ ( బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య) ఒక కారణంటున్నారు. కరోనా సమయంలో ఆర్‌టిసి దాయం రోజుకు రూ.15 లక్షల నుంచి 25 లక్షలకే పరిమితం కాగా అది ప్రస్తుతం రోజుకు రూ.1.75 కోట్ల నుంచి 2.25 కోట్లకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ముందు ఆర్‌టిసి ఆదాయం రోజుకు 2.50 కోట్లు ఆదాయం ఉండగా ప్రస్తుతం తాము అంతే కంటే ఎక్కవ ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు.