ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త ప్రక్రియ
జెరూసలెం : ఇజ్రాయెల్‌కు చెందిన పరిశోధకులు మూషిక పిండాలు గర్భాశయం బయటపెరిగే అద్భుతమైన కొత్త ప్రక్రియను అభివృద్ధి చేయగలిగారు. ప్రాథమిక దశలో ఈ విధంగా పిండాలు పెరగడం వల్ల జన్యువులు ఈ ప్రక్రియను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలియడమే కాక, పుట్టుకతోవచ్చిన లోపాలను కూడా గుర్తించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇజ్రాయెల్‌కు చెందిన వెయిజ్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని జాకబ్ హన్నా పరిశోధకులు రూపొందించిన ఈ కొత్త ప్రక్రియ వివరాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. క్షీరదాల పిండాల అభివృద్ధిని అధ్యయనం చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల ప్రకారం క్షీరదాలు కాని కప్పలు, చేపలు వంటివి పెట్టే పారదర్శక గుడ్లను పరిశీలించడం కానీ, లేదా మూషిక పిండాలను ఛేదించడం ద్వారా లభించే చిత్రాలను అధ్యయనం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడీ కొత్త ప్రక్రియ ప్రకారం శాస్త్రవేత్తలు గర్బాశయం బయట ప్రయోగాత్మకంగా ఏడేళ్ల కాలంలో పిండాలను అభివృద్ధి చేయడం గమనార్హం.
ఇందులో రెండంచెల పద్ధతిని వినియోగించారు. 20 రోజుల గర్భధారణ కాలంలో మూడోవంతు అంటే ఆరు రోజుల్లోనే సాధారణంగా గర్భాశయం బయట పిండాలను పెంచగలిగారు. ఈ కాలంలో పిండాలు శరీర నిర్మాణంతోపాటు అవయవాలు పారదర్శకంగా కనిపించాయి. ఇందులో మొదటి దశకు రెండు రోజులు పట్టగా, అనేక రోజుల పిండాలను గర్భాశయంలో ప్రవేశ పెట్టగలిగారు. తరువాత రెండోదశలో అవయవాల నిర్మాణం జరిగింది. ఈ కొత్త ప్రక్రియ వల్ల ఎందుకు అనేక గర్భధారణలు విఫలమౌతున్నాయి?పిండాలను గర్భాశయంలో ప్రవేశ పెట్టే ద్వారం చాలా చిన్నదిగా ఎందుకు ఉంటోంది? గర్భధారణలో ఏయే పరిస్థితులు అవలక్షణాలకు దారి తీస్తున్నాయి ? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఈ కొత్త ప్రయోగం వల్ల లభిస్తున్నట్టు పరిశోధకులు వివరించారు.