Wednesday, January 22, 2025

ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని నేటి పాలకులు ప్రగల్భాలు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో గత కొన్ని నెలలుగా జియస్‌టి 1.5 లక్షల కోట్ల రూపాయలు వసూలు అవుతున్నా, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రోజురోజుకూ పెరుగుతున్నా, ప్రపంచంలోనే అత్యధిక కుబేరులున్న దేశంగా భారత్ ఎదుగుతున్నా, జి20 సమావేశాలు అట్టహాసంగా నిర్వహించినా, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహిస్తాం అని ప్రకటించినా, యావత్ భారత దేశ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారా అంటే ‘మేడిపండు చూడమేలిమై ఉండు’ అనే చందంగా వున్నది అంటే అతిశయోక్తి కాదేమో.

ప్రపంచదేశాలు, భారత్ సర్వసౌకర్యాలతో తులతూగుతున్నది అని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండుట గమనార్హం. నేటికీ సుమారు 28 కోట్ల జనాభా అర్ధాకలితో, 21 కోట్ల మంది అనారోగ్యాలతో, కొన్ని కోట్ల మంది నిరుద్యోగంతో, పోషకాహార లోపంతో 18.7% శాతం జనాభా అందునా 15-24 మధ్యవయసు గల వారిలో 58.1% పోషకాహార లోపం వుండుట దేనికి సంకేతం! కుల, మత, ప్రాంతీయ అసమానతలతో, లింగ వివక్షతో కొన్ని కోట్ల మంది దుర్భర జీవితాలను కొనసాగిస్తున్నారు. మహిళలపై అణచివేతలు, వేధింపులు, అఘాయిత్యాలు, అక్రమ రవాణా, మత్తు బానిసలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న పాలకులు మధ్య అంకెలు/ ర్యాంకుల అభివృద్ధి చూసి భారత్ మురిసిపోవుట ముమ్మాటికీ ముప్పే.

నేటికీ అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మంచినీరు అందక అలమటిస్తున్న అభాగ్యులు ఎందరో…. పేదరికం పెనుశాపంలా దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది.్ అయినప్పటికీ కుబేరుల సంఖ్య పెరుగుతూ, కొద్ది మంది చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమై ఉండుట జగమెరిగిన సత్యం. ఒక పక్క సంపద పెరుగుతున్నా, పంపిణీ అసమానతలు వలన పేదరికం నానాటికీ పెరుగుతోంది అనే విషయం గుర్తెరగాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో తిరిగి ‘ క్షయ‘ వ్యాధి విజ్రృంభణకు ప్రధాన కారణం దారిద్య్రం, పోషకాహార లోపం అని తెలిపారు.్ 2020-2022 మధ్య కాలంలో 38 లక్షల మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిపోయారు అంటే భారత్ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం అంతా దాదాపు ఉచిత పథకాలకు ఖర్చు చేస్తూ, తిరిగి అధికారంలోకి రావడానికే కేంద్ర, రాష్ట్ర పాలకులు పరితపిస్తున్నారు తప్ప, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో 3.7 కోట్ల మంది భారతీయులు విదేశీయులు అయ్యారు. 1970- 90 మధ్య కాలంలో ‘మేధోవలసలు’ ఎక్కువగా జరిగితే, నేడు దీనికి తోడు ‘వ్యాపారవలసలు’ కూడా జోరందుకున్నాయి. కారణం ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం చెందుతున్నది. తరచూ మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక సమస్యల కారణంగా, రాజకీయ విధానాలు వలన పారిశ్రామిక వేత్తలు దేశంలో పరిశ్రమలు స్థాపించకుండా, విదేశీ బాట పడుతున్నారు. కేవలం గత ఏడాది 2022లో 7000 మంది కోటీశ్వరులు విదేశీ పౌరసత్వం తీసుకున్నారు.

2013 -22 మధ్య కాలంలో 48,500 మంది కోటీశ్వరులు విదేశీ పౌరులుగా మారిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ యువతకు ఉద్యోగావకాశాలు ఎండమావి వలే వున్నాయి. చదువుల్లో నాణ్యతలేకపోవడం, నైపుణ్యాలు లేమితో సతమతమవుతున్న యువతలో ఎక్కువ మంది శారీరక శ్రమపడే అసంఘటిత కార్మికులుగా విదేశీ బాటపడుతున్నారు. కేవలం 5-10% శాతం మాత్రమే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కలిగి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేయడానికి విదేశాలకు వెళ్లుతుంటే, మిగిలిన 90% మంది డ్రైవర్లుగా, పని, వంట మనుషులుగా, భవన నిర్మాణ కార్మికులుగా వలస బాట పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు, తైవాన్, ఇజ్రాయెల్, కువైట్ వంటి దేశాల్లో ఇప్పటికే అనేక మంది వెళ్ళడం జరిగింది.

ఈ విధంగా సంపన్నులు, వృత్తి నిపుణులు, మేధావులు, విద్యార్థులు విదేశీ బాటపడుతుంటే భవిష్యత్తులో భారత్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు ఆలోచన చేయాలి.కేవలం ఎన్నికలు, అధికారం చుట్టూ తిరిగే పార్టీలు, పాలకులు, ప్రభుత్వాలు ఇకనైనా వాస్తవ అభివృద్ధికి, వలసల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఏటా 25 లక్షల మంది వలస బాటపడుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అధికంగా డండుట గమనార్హం. దేశంలో సరైన వృత్తి, వ్యాపారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమే. విదేశాల్లో మెరుగైన జీవితాలు కోసం పయనమైపోతున్నారు.

దేశంలో కొత్తఉద్యోగాలు లేకపోవడం, పెరిగే ధరలు, పన్నుల భారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు ప్రజలను కుంగతీస్తున్నాయి. పిల్లల చదువులు ఖరీదుగా మారడం, వైద్య ఖర్చులు అధికంగా ఉండుట, ప్రశ్నించే వారిని అణగదొక్కాలని ప్రయత్నించడం, అరెస్టులు, రకరకాల వివక్షలు వంటివన్నియు భారత్ అభివృద్ధికి సవాల్‌గా మారనున్నాయి. భవిష్యత్తులో భారత్ వెనుకబాటుతనానికి కారణం కానున్నాయి. ప్రతి ఏటా పది కోట్ల మంది యువత ఉపాధి మార్కెట్లోకి వస్తున్నా అవకాశాలు లేవు. ప్రపంచంలోనే అత్యధిక యువత వున్న భారత్, నిరాశ నిస్పృహలకు నిలయంగా మారుతోంది. ఇకనైనా భవిష్యత్తు పరిణామాలు అంచనా వేసి సరిదిద్దుకోవాలి. అంకెలు, సూచీల అభివృద్ధి చూసి ఉబలాట పడకుండా, వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, సరైన ప్రణాళికతో ఉత్పత్తి రంగాల బలోపేతానికి కృషి చేయాలి. ఉపాధి కల్పన చేయాలి, ఉపాధి రహిత అభివృద్ధి కొంపముంచుతుందని గ్రహించాలి.

వ్యక్తిగత కక్ష, రాజకీయ అసమానతలు మానుకోవాలి. యువత శక్తియుక్తులను సమగ్రంగా వినియోగించుకోవాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. నైపుణ్యాభివృద్ధికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, శాస్త్రసాంకేతిక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే సున్నితమైన మతం, కులం, భాష, ప్రాంతీయత వంటి అంశాల జోలికి వెళ్ళకుండా, ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో పాలన అందివ్వాలి. బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సొమ్మును ధారాదత్తం చేయకుండా, పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కోసం వెచ్చించాలి.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. అప్పుడు మాత్రమే భారత్ వాస్తవ అభివృద్ధి సాధిస్తుంది. ఎన్నికల సమయంలో సక్రమంగా, నిజాయితీగా ప్రజలు ఓటు వేయాలి. ప్రజల పక్షాన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పార్టీలకు, పేద, శ్రామికవర్గ పక్షాన నిలిచే పార్టీల వైపు ఓటర్లు నిలబడి జై కొట్టాలి. యువత తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. వివక్షకు తావులేకుండా పాలించాలి. అప్పుడు మాత్రమే సర్వే జనాసుఖినోభవంతు అనే ఆర్యోక్తి భారత్ ప్రజలకు నూటికి నూరుపాళ్లు సరిపోతుంది.

* ఐపిరావు
6305682733

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News