మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో కోల్పోయినా బిఆర్‌ఎస్ నేతల వైఖరిలో మార్పురాలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణలో మార్పు కావాలనే ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన మరుసటి రోజే 2 హామీలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ రెండోసారి గెలిచాక మంత్రులు లేకుండా 2 నెలల పాటు పాలించారన్నారు. ప్రజలను అవమానిస్తూ కెసిఆర్ పాలన సాగించారని ఆయన మండిపడ్డారు.
ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసి బస్సు ల్లో మహిళలకు ఇప్పటికే రూ.6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని ఆయన తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ నేతల వైఖరి నవ్విపోదురుగాక, నాకేంటి అన్నట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 3,500 రోజులు పాలించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాలేదని అప్పుడే ప్రభుత్వంపై కెటిఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. మిగత హామీల అమలు కోసం ఓవైపు దరఖాస్తులు స్వీకరిస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా బిఆర్‌ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. వారిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడవదని, వారంత ఒకసారి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించాలని శ్రీధర్ బాబు సూచించారు.