రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ, వ్యాట్ వసూళ్లు
జనవరిలో 17 శాతం జీఎస్టీ ఆదాయం రాక
ఈ ఏడాది జనవరిలో రూ.6,017 కోట్ల వసూళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జీఎస్ట్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.5,448 కోట్ల జీఎస్టీ వసూళ్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ.6,017 కోట్లు వసూళ్లు అయ్యాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.6,858.55 కోట్లు వసూళ్లు అయ్యాయి. ఇక ప్రీ ఎస్‌జిఎస్‌టి వసూళ్లకు సంబంధించి తెలంగాణకు 2023, 24 సంవత్సరంలో రూ. 16,432 కోట్లు రాగా, 2024, 25లో రూ.17,722 కోట్లు రాగా 8 శాతం గ్రోత్ పెరిగింది. ఇక, పోస్ట్ ఎస్‌జిఎస్‌టికి సంబంధించి 2024, 25 సంవత్సరంలో రూ. 33,341కోట్లు రాగా, 2024, 25లో రూ.36,721 కోట్లతో తెలంగాణ గ్రోత్ 10 శాతం పెరిగింది.
తగ్గిన ఎపి జీఎస్టీ వసూళ్లు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గగా తెలంగాణలో మాత్రం 10 శాతం పెరగడం విశేషం. 2023 డిసెంబర్‌తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో ఎపి జీఎస్టీ వసూళ్లు 6 శాతం తగ్గాయి. డిసెంబర్ 2023, 24లో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు రూ.3,545 కోట్ల నుంచి రూ.3,315 కోట్లకు తగ్గాయి. అదే తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 2023 డిసెంబర్‌తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో రూ.4,753 కోట్ల నుంచి రూ.5,224 కోట్లకు పెరగడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు ఎస్‌జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజీఎస్టీ, సెస్‌ల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.33,371 కోట్లు రాగా, తెలంగాణకు రూ.46,289 కోట్లు వసూళ్లు అయ్యాయి. 2023తో పోల్చితే ఈ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 1.3 శాతం, తెలంగాణలో 5.5 శాతం పెరిగినట్లు కేంద్రం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందంజ
రాష్ట్రాల వారీగా చూసుకుంటే జనవరి నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందుంది. రూ.32,335 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. గుజరాత్ తర్వాత రూ. 12,135 కోట్లు, కర్ణాటక రూ. 14,353 కోట్లు, తమిళనాడు రూ. 11,496 కోట్లు, హర్యానా రూ. 10,284 కోట్లతో ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి. ఇక అత్యల్ప జీఎస్టీ వసూళ్లను చూసుకుంటే రూ. కోటి వసూళ్లతో లక్షద్వీప్ అట్టడుగు స్థానంలో ఉంది. మణిపూర్ (రూ. 56 కోట్లు), మిజోరాం (రూ.35 కోట్లు), అండమాన్ నికోబార్ దీవులు (రూ.43 కోట్లు), నాగాలాండ్ (రూ.65 కోట్లు) చివరి నుంచి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో జీఎస్టీ వసూళ్ల వివరాలు రూ.కోట్లలో ఇలా
నెల – 2023 – 2024 – పెరిగినమొత్తం (శాతంలో)
డిసెంబర్ – రూ.4,753 – రూ. 5,224 – 471
నవంబర్ – రూ.4,986 – రూ. 5,141 – 155
అక్టోబర్ – రూ.4,868 – రూ.5,211 – 343
సెప్టెంబర్ – రూ.5,226 – రూ.5,267 – 41
ఆగష్టు రూ.4,393 – రూ.4,569 – 176
జూలై – రూ.4,849 – రూ.4,940 – 91