కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: జిఎస్‌టి పరిహార సెస్ విధింపు గడువును ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడిగించింది. దీంతో 2026 మార్చి 31 వరకు పరిహార సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిబంధనలను కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫై చేసింది. వాస్తవానికి ఈ నెల 30తో సెస్ విధింపునకు స్వస్తి పలకాల్సి ఉంది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ అయిన జిఎస్‌టి మండలి మాత్రం దీన్ని మరికొంత కాలం వసూలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రం రుణాలు తీసుకుంది. దీంతో అవి తీరేవరకు సెస్‌ను కొనసాగించాలని మండలి తీర్మానించింది. మరో వైపు జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే కేంద్రం చెల్లించాల్సిన పరిహారం గడువు మాత్రం ఈ నెల 30తో ముగియనున్నట్లు నిర్మలా సీతారామన్ గతంలోనే స్పష్టం చేశారు. 2017 జులై 1న వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)ను ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని అయిదేళ్ల పాటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం కేంద్రం 2020 21ఆర్థిక సంవత్సరంలో రూ.1.1 లక్షల కోట్లు, 2021 22లో రూ.1.59 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.7,500 కోట్లు వడ్డీ చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.14,000కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా 2023 24 ఆర్థిక సంవత్సరంనుంచి అసలును చెల్లించడం మ్రొదలుపెట్టి 2026 వరకల్లా పూర్తి చేయాల్సి ఉంది. కాగా సెస్ కొనసాగింపు వల్ల పొగాకు, సిగరెట్లు, హుక్కా, ఏరేటెడ్ వాటర్స్, ప్రీమియం మోటారు సైకిళ్లు, విమానాలు వంటి వాటి ధరలు అధికంగా ఉండనున్నాయి. మరోవైపు ఈ నిర్ణయం వల్ల తమ వ్యాపారాలపై భారం కొనసాగుతుందని ఆ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.