ఎరువుల రంగాన్ని ప్రస్తుత 5 శాతం జిఎస్‌టి నుంచి మినహాయించాలన్న సిఫార్సును రేట్ హేతుబద్ధీకరణకు సంబంధించిన మంత్రుల బృందం (జిఒఎం)కు జిఎస్‌టి కౌన్సిల్ నివేదించిందని ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం వెల్లడించారు. ఎరువుల తయారీ సంస్థలు, రైతుల ప్రయోజనార్థం పోషకాలు, ముడి వస్తువులపై జిఎస్‌టిని తగ్గించేందుకు రసాయనాలు, ఎరువుల స్థాయీ సంఘం ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులను జిఎస్‌టి కౌన్సిల్ చర్చించింది. ప్రస్తుతం ఎరువులపై 5 శాతం వంతున జిఎస్‌టి విధిస్తున్నారు. సల్ఫ్యూరిక్ ఏసిడ్, అమ్మోనియా వంటి ముడి వస్తువులపై 18 శాతంవంతున అధిక జిఎస్‌టి విధిస్తున్నారు.
53వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ, ఎరువులపై జిఎస్‌టి రేటు తగ్గించాలన్న సిఫార్సును జిఒఎంకు నివేదించారని తెలియజేశారు. ఎరువులపై పన్నును మరింత తగ్గించాలన్న ప్రతిపాదనను 2021 సెప్టెంబర్‌లో, 2022 జూన్‌లో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల్లో జిఎస్‌టి కౌన్సిల్ ముందు ఉంచారు. కానీ రేట్లలో మార్పుపై కౌన్సిల్ ఎటువంటి సిఫార్సూ చేయలేదు. ఎనిమిది మాసాల విరామం తరువాత శనివారం జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది. 52వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నిరుడు అక్టోబర్ 7న జరిగింది.