Saturday, November 16, 2024

వంటగ్యాస్‌పై మోడి సర్కారు బండ బాదుడు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుపేద కుటుంబాలను కూడా వదలిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో బండ బాదుడు బాదేస్తోంది. మోడి ప్రభుత్వం జీఎస్టీ పన్నుల కింద వంటగ్యాస్‌పై ఏటా రూ.23,205కోట్లు వినియోగదారులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లి పుల్లా పుట్రా ఏరుకుని వంటకు అవసరాలు తీర్చుకునే గ్రామీణ ప్రాంత ప్రజల పాలిట ఇప్పడు గ్యాస్ కొనుగోలు పెద్ద గుదిబండగా మారింది. వంటచెరుకును మాన్పించి ప్రత్యామ్నాయంగా గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించి, క్రమేపి గ్యాస్‌లేకుండా వటచేసుకునే వీల్లేని విధంగా ప్రజలను మార్చివేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదేగ్యాస్ మంటతో ప్రజలను పన్నుల రూపంలో కాల్చుకుతింటోందన్నవిమర్శలు వస్తున్నాయి.

వంటగ్యాస్ కిందనే ఏటా దేశంలో రూ.4,64,100కోట్ల ప్రజాధనం ఆవిరవుతోంది. గ్యాస్ కొనలేక ప్రజల ఆక్రందన మంటలతో చలికాచుకుంటున్న రీతిలో ప్రధాని మోడి సర్కారు గ్యాస్ కోనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడి నుంచి జిఎస్టీ పన్నుల కింద ఏటా వేలకోట్లు దండుకుంటోంది. జనం వంట చెరుకుతో అవసరాలు తీర్చుకునే రోజులే మేలంటున్నారు .1989నాటికి గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.57.80ఉండేది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేనాటికి 2014లో గ్యాస్ ధర రూ.470ఉండేది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అంచెలంచెలుగా పెంచుతూ సామన్య , మధ్యతరగతి కుటుంబాల పాలిట పెద్దగుదిబండా మార్చివేసిందన్న విమర్శలు వస్తున్నాయి.

గ్యాస్‌ధరలు పెంచిన తీరును చూస్తే 2017నాటికి రూ.646కు ,2020నాటికి రూ.910కి, 2022నాటికి రూ.1105కు పెంచుతూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు గ్యాస్‌ధరలు పెంచింది. గ్యాస్ ధరలు పెంచిన ప్రతిసారి వినిమయోగదారులకు పెరిగిన ధరలు భారం కాకుండా సబ్సిడీపెంచి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను కూడా తొలగిస్తూ పేద కుంటుబాల కొనుగోలు శక్తిని మరింత మంటల్లోకి నెట్టేసిందంటున్నారు. ఇప్పటివరకూ దేశంలో 35కోట్ల కుటుంబాలు గ్యాస్‌కనెక్షన్ పొందినట్టు గ్యాస్ కంపెనీలు వెల్లడించాయి. నెలకు రెండు సిలిడర్లు వినియోగిస్తున్న కుటుంబాలు 30శాతం ఉండగా , ఒక్క సిలిండర్‌తోనే సరిపెట్టుకుంటున్న కుంటుంబాలు 70శాతం ఉన్నట్టు గ్యాస్‌డీలర్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రతినెల సగటున 35కోట్ల సిలిడర్ల వినియోగం జరుగుతోంది. గ్యాస్‌సిలిండర్ ధర రూ.1105కింద ప్రతినెల 38,675కోట్లు గ్యాస్ కింద ఖర్చు చేయాల్సివస్తోంది. నిత్యావసర సరుకుల ధరల మంట అటుంచితే ,వంట అవసరాలకిందనే ఏటా గ్యాస్‌రూపంలోనే రూ.4,64,100కోట్ల మేరకు భారం మోయాల్సివస్తోంది. ప్రతినెల తొలిరోజునే చమురు కంపెనీలు సమీక్షా సమావేశాలు నిర్వహించి కూడ బలక్కుని గ్యాస్ సిలిండర్ ధరలు నిర్ణయిస్తున్నాయి.

సిలెండర్‌పైన జిఎస్టీకింద 5శాతం పన్ను:
ప్రధాని మోడి ప్రభుత్వం జీఎస్టీ పన్నుల విధానం ప్రవేశపెట్టకముందు వంటగ్యాస్‌పై ఏవిధమైన పన్నులు ఉండేవి కావు. జీఎస్టీ అమల్లోకి వచ్చాకే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పైన 5శాతం పన్ను వినియోగదారుల నుంచి పిండుకుంటోంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతన్న కొలదీ కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్ను రూపంలో అదనపు ఆదాయం సమకూరుతోంది. ఒక్కో సిలిండర్‌పైన 5శాతం కింద రూ.55.25 వసూలు చేసుకుంటోంది. జిఎస్టీ కిందనే మోడి ప్రభుత్వం ఏటా రూ.23,205కోట్లు దండుకుంటోంది. ఒక వైపు వంటగ్యాస్‌పైన రాయితీలు తగ్గిస్తూ , మరోవైపు ధరలు పెంచుతూ కేంద్రం నిరుపేదలు ,సామాన్యులు మొదలుకుని అన్ని వర్గాల వినియోగదారుల నడ్డివిరుస్తోంది.
తెలంగాణపైన మరింత భారం!
వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న కొలదీ తెలంగాణలో నిరుపేద కుంటుంబాలనుంచి హాహా కారాలు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో 1.18కోట్ల గ్యాస్‌కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు సగటున 1.20లక్షల సిలిడర్లు డెలివరీ చేస్తున్నట్టు గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుల రూపంలో రూ.66.30లక్షలు దండుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News