27 ఏళ్ల అకౌంటెంట్‌ను అరెస్టు చేసిన జిఎస్‌టి అధికారులు
న్యూఢిల్లీ : ఒక అకౌంటెంట్ ఏకంగా రూ.1000 కోట్ల బోగస్ బిల్లులు, రూ.181 కోట్ల ఐటిసి(ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్) మోసాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్టు చేసినట్టు బుధవారం జిఎస్‌టి అధికారులు తెలిపారు. మోసానికి పాల్పడిన 27ఏళ్ల యువకుడు 12వ తరగతి చదివాడని, అతను అకౌంటెంట్, జిఎస్‌టి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. డేటా మైనింగ్, డేటా అనాలసిస్ నుంచి అందుకున్న ప్రత్యేక సమాచారంతో ఈ మోసంపై అధికారులు విచారణ ప్రారంభించారు. నితిలాన్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట వస్తు, సేవలకు ఎలాంటి రసీదులు లేకుండా నకిలీ ఇన్వాయిస్ సృష్టించినట్టు తేలింది. ఆ అకౌంటెంట్ తన గురించి తెలియకుండా, ఒక క్లయింట్ ఐడెండిటీని దొంగిలించి జిఎస్‌టి మోసాలకు పాల్పడ్డాడు. రూ.1000 కోట్లకు పైగా బోగస్ బిల్లులు, నకిలీ ఐటిసిలతో రూ.181 కోట్ల మోసానికి పాల్పడిన ఆ అకౌంటెంట్‌ను ముంబై జోన్‌కు చెందిన పాల్గర్ సిజిఎస్‌టి కమిషనరేట్ అధికారులు అరెస్టు చేశారు.