జిఎస్‌టి రేట్ హేతుబద్ధీకరణకు సంబంధించిన మంత్రుల బృందం (జిఒఎం) 20 లీటర్ల ప్యాకేజ్డ్ మంచినీటి సీసాల,. సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్స్‌పై పన్ను రేట్లు తగ్గించాలని శనివారం నిర్ణయించిందని, కానీ హై ఎండ్ రిస్ట్ వాచీలు, షూలపై పన్నులు హెచ్చించాలని సూచించిందని అధికారి ఒకరు వెల్లడించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఆధ్వర్యంలోని జిఎస్‌టి రేట్ హేతుబద్ధీకరణ జిఒఎం తీసుకున్న ఈ రేట్ల మార్పు నిర్ణయం వల్ల రూ. 22 వేల కోట్ల మేరకు రెవెన్యూ పెరుగుతుందని అధికారులు తెలియజేశారు. 20 లీటర్లు అంతకు మించిన ప్యాకేజ్డ్ మంచినీటిపై జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జిఒఎం ప్రతిపాదించింది. జిఒఎం సిఫార్సును జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదించినట్లయితే, రూ. 10 వేల లోపు విలువ చేసే సైకిళ్లపై జిఎస్‌టి 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది. ఎక్సర్‌సైజ్ నోట్ బుక్స్‌పై జిఎస్‌టిని కూడా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జిఒఎం ప్రతిపాదించింది.
రూ. 15 వేలు మించిన షూలపైన, రూ. 25 వేలు మించిన రిస్ట్ వాచీలపైన జిఎస్‌టిని 18 శాతం నుంచి 28 శాతానికి హెచ్చించాలని కూడా జిఒఎం సూచించింది. రేటు హేతుబద్ధీకరణకు సంబంధించిన జిఒఎం గత సమావేశంలో వందకు పైగా వస్తువులపై పన్ను రేట్ల మార్పు గురించి చర్చించింది. సామాన్యునికి వెసులుబాటు కల్పిస్తూ కొన్ని సరకులపై పన్నులను 12 శాతం నుంచి 5 శాతానికి జిఒఎం తగ్గించింద. హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్‌లు, బ్యూటీ లేదా మేకప్ వస్తువులు వంటివ 18 శాతం శ్లాబ్‌లోని కొన్ని వస్తువులను తిరిగి 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావచ్చు. ఆరుగురు సభ్యుల జిఒఎంలో ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య సేవల శాఖ మంత్రి గజేంద్ర సింగ్, కర్నాటక రెవెన్యూ శాఖ మంత్రి బైరె గౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్ర కెఎన్ బాలగోపాల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జిఎస్‌టి 5,12, 18, 28 శాతం శ్లాబ్‌లతో నాలుగు అంచెల పన్ను వ్యవస్థ కలిగి ఉన్నది.