Friday, December 20, 2024

పాలు, పెరుగుపైనా జిఎస్‌టి

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: పెట్రోల్, డీజెల్ రేట్‌లను శతాధికం చేయడం ద్వారానూ, యితరత్రానూ సాధారణ ప్రజల జీవితాలను దుర్భరం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం బియ్యం, పెరుగు వంటి పదార్ధాల పైనా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ను విధించి వారిపై అసాధారణమైన జీవన భారాన్ని మోపింది. గత నెలలో జరిగిన 47వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నేరుగా అను దినసరి అవసర సామాగ్రిపైనే ప్రతాపం చూపింది. ఇంత వరకు జిఎస్‌టి పరిధిలో లేని సరకులను 5 శాతం పన్ను స్లాబు కిందికి తెచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా బియ్యం, పప్పులు, పెరుగు, లస్సీ మీద కూడా పన్ను విధించడం అన్యాయమంటూ దేశ రాజధానిలో వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా శనివారం బంద్ పాటించారు. యూనిట్ కంటైనర్‌లోని ప్రీ ప్యాక్డ్, లేబుల్ పప్పులు, బియ్యం, గోధుమ, గోధుమ పిండి, ప్రీ ప్యాక్డ్ పెరుగు, లస్సీ, మొరమొరాలును 5 శాతం జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చారు.

ఎల్‌ఇడి బల్బులు, లైట్స్, ఫిక్స్చర్, వాటి మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ బోర్డులను 12 శాతం నుంచి 18 శాతం జిఎస్‌టి విభాగంలోకి తీసుకు వెళ్లి వాటిపై పన్నును పెంచారు. సోలార్ వాటర్ హీటర్, సిస్టంలను 5 శాతం నుంచి 12 శాతం స్లాబుకి తీసుకెళ్లారు. రోజుకు రూ. 1000 వరకు అద్దె వసూలు చేసే హోటల్ వసతి పై 12 శాతం పన్ను వేస్తారు. ఐసియు మినహా యితర ఆసుపత్రి గదులపై వొక్కో పేషెంట్ నుంచి రూ. 5000కు మించి వసూలు చేసే వొక్కో గది అద్దెపై 18 శాతం జిఎస్‌టి వసూలు చేస్తారు. ప్రింటింగ్, రాత సిరా మీద పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచారు. ఈ విధంగా ఆహారం, వసతి, ఆసుపత్రి వసతి పై పన్నులు విధించి, పెంచి జీవన వ్యయాన్ని అధికం చేశారు. ఇప్పుడిప్పుడే ప్యాక్డ్ ఆహారం, మాల్స్ వైపు మళ్లుతున్న సాధారణ, మధ్యతరగతి ప్రజలను లక్ష్యం చేసుకొన్నారు. జిఎస్‌టి మండలి తీసుకొన్న యీ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారిక సమాచారం.

వాస్తవంగా అంతకంటే యెక్కువే వుండవచ్చు. క్రయ విక్రయ క్రమంలో పన్ను యెగవేతకు ఆస్కారం లేకుండా మొత్తం మార్కెట్ నుంచి గోళ్లు వూడగొట్టి వసూలు చేయడం, ఆక్రమంలో సామాన్య జనానికి యేమాత్రం వూరట లేకుండా చూడడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని బోధపడుతున్నది. ప్యాక్డ్ మాంసం, చేప, తేనె, పాలు ను కూడా విడిచిపెట్టలేదు. ఇలా అన్ని రకాల ఆహార పదార్ధాలపైన జిఎస్‌టిని విధించినందున చిల్లర ద్రవ్యోల్బణ పెరుగుతుంది. ఇది యిప్పటికే హద్దు మీరిపోయింది. ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నది. సాధారణంగా 6 శాతం వద్ద వుండవలసిన యీ ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద బుస కొడుతున్నది. రాష్ట్రాలకు జిఎస్‌టి రాబడి లోటును పూడ్చడానికి పరిహారం చెల్లింపు గడువు ముగిసిపోయినందున దాన్ని పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయమై జూన్‌లో జరిగిన 47 వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు.

ఈ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం రాష్ట్రాలను గతంలో ముప్పుతిప్పలు పెట్టింది. అంతేకాక కేంద్రం రాష్ట్రాల నుంచి జిఎస్‌టి వసూళ్లు తీసుకొంటూ, తాను మాత్రం వాటికి పంచి యివ్వాల్సిన అవసరం లేని సెస్సులు, సర్చార్జీలు వసూలు చేసుకోడం వివాదాస్పదంగా మారింది. పెట్రోలు, డీజెల్, విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం వంటి పద్దుల పైన సెస్‌ల ద్వారా ప్రజల నుంచి కేంద్రం వసూళ్లు మొదలుపెట్టింది. ఇందులో రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసిన పనిలేదు. జిఎస్‌టి రాక ముందు కేంద్రం, రాష్ట్రాలు 17 రకాల పన్నులు, 13 సెస్సులు వసూలు చేసుకునేవి. ఆ స్వేచ్ఛను వదులుకొని కేంద్రం ఆధ్వర్యంలో నడిచే జిఎస్‌టికి అంగీకరించి మోసపోయామనే బాధ బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో వున్నది. యే కాలంలోనైనా పన్ను వేసే హక్కు, అధికారం ప్రభుత్వానివి, భరించాల్సిన బాధ్యత ప్రజలదే. అయితే ప్రజల వోటే తాము అధికారానికి రావడానికి యేకైక మార్గం అయిన చోట ప్రభుత్వాలు యీ అధికారాన్ని జనహితానికి దోహదపడేలా ఉపయోగించాలి. ప్రధాని మోడీ ప్రభుత్వం మొదటి నుంచి యిందుకు పూర్తి వ్యతిరేక దిశగానే ప్రయాణం చేస్తున్నది.

కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నది. కస్టమ్స్ సుంకాలను తగ్గించి విదేశీ ఉత్పత్తులు దేశంలోకి సులువుగా ప్రవేశించడానికి దారులు వేసింది. దేశీయ ఉత్పత్తులను దెబ్బ తీసింది. గత యేడాది అక్టోబర్ నాటికి చూస్తే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబడి పన్ను (ఇన్‌కమ్ టాక్స్) వసూలు రెట్టింపు కంటే యెక్కువైంది. 2014-15 లో రూ. 2.6 లక్షల కోట్లున్న ఐటి వసూళ్లు 2020-2021 నాటికి రూ. 5.6 లక్షల కోట్లకు చేరాయి. 117 శాతం పెరిగాయి. అదే సమయంలో బడా కంపెనీల నుంచి వసూలు చేసిన కార్పొరేట్ పన్ను రూ. 4.3 లక్షల కోట్ల నుంచి రూ 5.5 లక్షల కోట్లకు చేరింది. అంటే 28 శాతమే పెరిగింది. దీనిని బట్టి మోడీ ప్రభుత్వం దిశను ఆర్ధం చేసుకోవచ్చు. ఆదాయం పెంచుకోడానికి సామాన్య ప్రజల మీద తరచూ పడకుండా కార్పొరేట్‌ల వైపు ప్రభుత్వం దృష్టి సారించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News