మనతెలంగాణ/ హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జిఎస్‌టిని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోస్టు కార్డు రాశారు. మంత్రి తన స్వహస్తాలతో రాసిన పోస్టు కార్డును మంత్రి పోస్టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ చేనేతలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, వారిని ఆదుకుంటుంటే, కేంద్రం వారి నడ్డి విరిచేలా చేనేతలపై 5 శాతం జిఎస్‌టి విధించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంటే, కేంద్రం చేనేత కార్మికులపై కక్ష కట్టిందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన రంగం చేనేత అని మంత్రి అన్నారు. అలాగే, దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా చేనేతలపై విధించిన జిఎస్‌టిని ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.