Monday, December 23, 2024

రాష్ట్రాలకు పరిహారం?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాలు ఒప్పుకొంటే పెట్రోల్, డీజెల్‌ను వస్తు, సేవల (జిఎస్‌టి) పన్ను పరిధిలోకి తీసుకు రాడానికి సిద్ధంగా వున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి, నిజాయితీ కంటే నెపం రాష్ట్రాల మీదికి త్రోసివేసే కపట పన్నాగమే కనిపిస్తున్నది. ఈ ఇంధనాలను జిఎస్‌టి కిందికి తీసుకువెళితే కేంద్రానికి, రాష్ట్రాలకు అంగీకారమైన లేదా జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించే ఏ రేటు ప్రకారమైనా దేశ వ్యాప్తంగా ఒకే పన్నును వీటిపై వసూలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు ప్రస్తుతం పొందుతున్న ఆదాయాన్ని చాలా మేరకు కోల్పోవలసి వస్తుంది. అన్ని రకాలుగా అధిక ఆదాయం పొందుతున్న కేంద్రం పెట్రోల్, డీజెల్‌పై తాను వసూలు చేస్తున్న సుంకాలను, సెస్సులను తగ్గించుకొని ప్రజలకు ఊరట కలిగించవచ్చు.

గతంలో అది ఒక సంప్రదాయంగా వుండేది. ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆదాయ మార్గాలను, అవి అప్పులు తెచ్చుకొనే దారులను వీలైనంతగా పరిమితం చేసి వాటిని ఇబ్బందులకు గురి చేసే పద్ధతిని ఎంచుకొన్నది. దీని వల్ల ప్రగతి పథంలో నడుస్తున్న రాష్ట్రాలు ముఖ్యంగా బిజెపియేతర పార్టీల అధికారంలోని రాష్ట్రాలు ఆర్థికంగా అణగారిపోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజెల్‌పై రాష్ట్రాలు తాము వసూలు చేస్తున్న వ్యాట్‌ను కోల్పోతే మరింత నష్టపోయే ప్రమాదం వున్నది. దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు రూ. 100, ఆ పైకి చేరుకొని చాలా కాలమైంది. రవాణా ఇంధనమైన డీజెల్ ధర విపరీతంగా పెరిగిపోడం వల్ల అన్ని సరకుల ధరలూ విజృంభించి సాధారణ ప్రజల జీవితాలు దుర్భరమైపోయాయి. 2022 మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు వరుసగా 16 రోజుల పాటు పెట్రోల్, డీజెల్ ధరలను కేంద్రం పెంచివేసింది.

దానితో అవి అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకొన్నాయి. మన అవసరాల్లో 85% మేరకు ఆయిల్‌ను దిగుమతి చేసుకొంటున్నాము. అందుచేత అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర పెరిగినప్పుడల్లా మన దిగుమతి బిల్లు పెరగక తప్పడం లేదు. దేశ ప్రజల పేదరికం కారణంగా సుదూర గతంలో చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజెల్ ధరలపై సబ్సిడీని భరిస్తూ వచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి దేశంలో వాటి ధరలను రోజువారీగా సవరిస్తూ వుండాలని నిర్ణయం తీసుకొన్నారు. కాని ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్‌ను చవకగా పొందుతున్నప్పటికీ ఆ మేరకు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలను తగ్గించడం లేదు. పూర్వపు నష్టాలను పూడ్చుకొనే పేరిట పెంచిన ధరలనే కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ లభ్యమవుతున్న ధరకే దేశ ప్రజలకు పెట్రోల్, డీజెల్‌ను సరఫరా చేస్తే కారుచవకగా అవి లభిస్తాయి.

కాని దానికి అదనంగా కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నులు కలిసి వాటి ధరలు మిన్నంటుతున్నాయి. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులు రాష్ట్రాల వ్యాట్ కలిసి తడిసిమోపెడవుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్రం నాలుగు రకాల సెస్సులను వసూలు చేస్తున్నది. అవి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 1, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 2, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా 3% సెస్సు. యుపిఎ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్‌డిఎ హయాంలో పెట్రోలియం ఉత్పత్తుల మీద అత్యధికంగా సెస్సును వసూలు చేస్తున్నారు. కేంద్రం వసూలు చేసే సెస్సులో రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసిన పని లేదన్నది తెలిసినదే. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ప్రధాని మోడీ ప్రభుత్వం వీలు చిక్కినప్పుడల్లా సెస్సులను విధిస్తూ పోతున్నది. కేంద్రం తన మొత్తం పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు పంచి ఇవ్వాల్సిన నిధులనూ కోత కోస్తున్నది. పెట్రోల్, డీజెల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకు రావడం వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం మేరకు వాటికి పరిహారాన్ని కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై వుంది.

దీనిని ప్రస్తావించకుండా రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడానికి అభ్యంతరం లేదనడం కపట ప్రతిపాదనే అవుతుంది. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ. 5 లక్షల కోట్లు ఆదాయాన్ని పొందుతున్నాయి. జిఎస్‌టిలో గరిష్ఠ రేటు పన్నును వాటి మీద వసూలు చేసినా రాష్ట్రాలు అమితంగా నష్టపోయే ప్రమాదమే వున్నది. వీటిని జిఎస్‌టి పరిధిలో పెడితే అన్ని రాష్ట్రాలు కలిసి రూ. 2 లక్షల కోట్లు కోల్పోతాయంటున్నారు. మహారాష్ట్ర ఒక్కటే ఏడాదికి రూ. 8000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని చెబుతున్నారు. కర్నాటక సగటు నెలవారీ ఆదాయం రూ. 1500 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు పడిపోనున్నది. అందుచేత రాష్ట్రాలకు తగిన పరిహారం విషయం ఆలోచించవలసిన బాధ్యత కేంద్రంపై వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News