నేడు లక్నోతో ఢీ
లక్నో: వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ సూపర్ జెయింట్స్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగు విజయాలను సాధించింది. ఇక లక్నో ఐదు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
కాగా, లక్నో టీమ్‌లో విధ్వంసక బ్యాటర్లకు కొదవలేదు. నికోలస్ పూరన్, మిఛెల్ మార్స్, సమద్, మార్‌క్రమ్, సమద్, బడోని, కెప్టెన్ రిషబ్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పూరన్ 36 బంతుల్లోనే అజేయంగా 87 పరుగులు చేశాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. మార్ష్ కూడా సీజన్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. మార్‌క్రమ్ కూడా జోరుమీదున్నాడు. కానీ కెప్టెన్ పంత్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. పంత్ కూడా గాడిలో పడితే లక్నోకు హ్యాట్రిక్ విజయం ఖాయం.
మరోవైపు గుజరాత్ కూడా దూకుడు మీద కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడైన ప్రదర్శన చేస్తోంది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, షారుక్ ఖాన్, రూథర్‌ఫోర్ట్, తెవాటియా, జోస్ బట్లర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బట్లర్, గిల్ వంటి స్టార్ బ్యాటర్లు ఉండడం జట్టుకు మరింత కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఇక సిరాజ్, అర్షద్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, సాయి కిశోర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.