Wednesday, January 22, 2025

పంజాబ్ కు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో పోరు

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఇక గుజరాత్ మూడింటిలోరెండు విజయాలను అందుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో గుజరాత్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. సాహా, గిల్‌లు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభారంభం అందించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా గిల్‌కు ఉంది. గిల్ చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. సాహా కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ధాటిగా ఆడుతూ జట్టుకు మెరుపు ఆరంభం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సాయి సుదర్శన్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో సాయి మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.

ఈసారి కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. ఇక డేవిడ్ మిల్లర్ కూడా గాడిలో పడడం గుజరాత్‌కు సానుకూలంగా మారింది. సన్‌రైజర్స్‌పై మిల్లర్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ తనదైన శైలీలో చెలరేగితే ఆపడం ఎంత పెద్ద బౌలర్‌కైనా శక్తిగా మించిన పనిగానే చెప్పొచ్చు. విజయ్ శంకర్ కూడా జోరుమీదున్నాడు. ఇక అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వంటి అగ్రశ్రేణి ఆట్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. అజ్మతుల్లా, రషీద్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్ తదితరులతో గుజరాత్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న గుజరాత్ మరో విజయంపై కన్నేసింది.

సవాల్ వంటిదే

ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు పంజాబ్ ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన పంజాబ్ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌లతో జరిగిన పోటీల్లో పరాజయం చవిచూసింది. ఇలాంటి స్థితిలో బలమైన గుజరాత్‌తో జరిగే పోరుకు పంజాబ్‌కు పరీక్షగా మారింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో బెయిర్‌స్టో గాడిలో పడడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.

జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, శశాంక్ సింగ్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్, రబడా, హర్‌ప్రీత్ బ్రార్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. కానీ నిలకడగా లోపించడం జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు లేకుండా బరిలోకి దిగాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News