Monday, December 23, 2024

పేద ప్రజలకు ఉపాధి హామీ గొప్ప వరం లాంటిది

- Advertisement -
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగులు
ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీల బ్రతుకులకు భద్రత కల్పించడం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రధాన లక్ష్యమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్లు రవిందర్, జాన్ వెస్లీ తెలిపారు. నైపుణ్యము లేని పనులను చేయడానికి ముందుకు వచ్చే ప్రతి కూలి కుటుంబానికి ఏడాదిలో కనీసం 100 రోజుల పని దినాలు కల్పిస్తామని, పని కల్పించలేకపోతే నిరుద్యోగభృతి చెల్లించడం, పనిచేసే చోట తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆశాఖ అధికారులు, ప్రభుత్వానికి, కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభించక ముందు నిరుపేద కూలీలకు కనీస వేతనము రాక ఆడ, మగ కూలీలకు వేతనములో తేడా చూపిస్తూ రూ. 20 నుండి రూ. 25లు రోజువారి కూలిగా పొందే వారని పేర్కొన్నారు. ఒక పక్క శ్రమ దోపిడి వ్యవసాయ కూలి దొరకని సమయములో చేద్దామంటే పనులు లేక, ఒక్క పనికే అందరూ ఎగబడి తక్కువ కూలికి పని చేసే వారన్నారు. ఈచట్టం అమలుల్లోకి వచ్చిన తరువాత ప్రతి పల్లెలో వేసవికాలం కూలీ దొరకడం ఆడ,మగ కూలీలకు సమానవేతనం చెల్లించడం, చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ఈపథకం గ్రామాల్లో ఒక పండగలా సాగిందని, దీని ప్రభావంతో శ్రమదోపిడీ తగ్గి కూలీ పనులకు వేతనాలు పెరిగినట్లు వెల్లడించారు. ఈ పరిణామం పేదవారి జీవితాలకు భరోసా నింపడంతో పాటు ఆత్మగౌరవాన్ని పెంచిందన్నారు. తిండిఖర్చులకు, పిల్లల చదువులకు, ఆరోగ్యానికి ఇతర అవసరాలకు పైసలు రావడం ఇతర ఆపదలకు అప్పు పుట్టడంతో నిరుపేద కూలీలకు భద్రతను కల్పించిందని పేర్కొన్నారు. ఉన్నచోట కూలీ దొరకడం కూడా ప్రభుత్వం కల్పించడం కలలో కూడా ప్రజలు ఊహించలేదని, ఉపాధి హామీ చట్టం పేదల వారి పాలిట వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాయింట్ కమిషనర్లు శేషుకుమార్, నర్సింహులు, శ్రీనివాసులు, స్వామి, మురళీధర్, క్రిష్ణమూర్తి, అంజనేయులు, అబేద్‌ఖాన్, నరేష్, శ్రీనివాస్, ర ఘవీర్, మౌనిక, శాంతి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News