Friday, December 20, 2024

గ్యారెంటీల అమలు బడ్జెట్ !

- Advertisement -
- Advertisement -

హామీలకు అద్దంపట్టే బడ్జెట్
2024-25 బడ్జెట్ కసరత్తు షురూ
సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో బడ్జెట్
అసలైన తెలంగాణ బడ్జెట్ లా ఉండాలి
బడ్జెట్‌లో వాస్తవికతకు పెద్దపీట
సిఎం రేవంత్ ఆదేశాలకు అనువుగా బడ్జెట్

మన తెలంగాణ / హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలుచేసేందుకు వీలుగా 2024-25వ ఏడాదికి బడ్జెట్‌ను రూపకల్పన చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు తీర్చే విధంగా వాస్తవికతతో కూడిన బడ్జెట్‌ను రూపొందించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులకే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని, సిఎం హామీలను యుద్దప్రాతిపదికన అమలు చేయాల్సి ఉందని, పైగా ఈ ఏడాదిలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసే బృహత్తర కార్యక్రమం ముందున్నందున, బడ్జెట్ రూపకల్పనలో ఎన్నో ఛాలెంజెలను దృష్టిలో పెట్టుకొని కసరత్తులు చేస్తున్నామని వివరించారు.

ఒకవైపున కేంద్ర ప్రభుత్వం రానున్న ఆర్ధిక సంవత్సరానికి (2024-25) ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని, అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎన్ని వస్తాయి?, ఆ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దగా నిధులను కేటాయింపులు చేయకుండా కేవలం ప్రభుత్వ ఖర్చులకు, పాలనాపరమైన అవసరాలకు మాత్రమే నిధులను కేటాయించి కేంద్రం చేతులు దులుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, మరలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం ఆశలు పెట్టుకోవడం వృధా ప్రయాసే అవుతుందని మరికొందరు అధికారులంటున్నారు. అదీగాక కేంద్రం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను మూడు నెలల కోసం ప్రవేశపెడతారా? లేక ఆరు నెలల కోసం ప్రవేశపెడతారా? అనే అంశాల్లో కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని, అందుకే రాష్ట్ర బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఆర్ధిక సంవత్సరం మొత్తానికీ ప్రవేశపెట్టాలా? లేక మనం (తెలంగాణ) కూడా ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలా? అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారులు వివరించారు.

అయినప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖలకు మాత్రం 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన నిధులపై ప్రతిపాదనలు ఇవ్వాలని కోరామని, అదికూడా ఏడాదికి సరిపడా బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వాలని కోరామని వివరించారు. అందుకు తగినట్లుగా ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధంచేసే పనిలో ఉన్నారని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున… ఎలాగూ కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెద్దగా నిధుల కేటాయింపులు కూడా ఉండకపోవచ్చునని, ఒకవేళ కేటాయింపులు చేసినా అవి గరిష్టంగా ఆరు నెలలకే పరిమితంగా ఉండవచ్చునని, అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను ఏడాదికి సరిపడా ప్రవేశపెడితేనే సత్ఫలితాలు ఉంటాయని కొందరు సీనియర్ అధికారులంటున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో (2023-24) వస్తున్న ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుతమున్న ఆదాయం సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయలని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మరో 0.5 శాతం పెంచుకోగలిగితే అదనంగా సుమారు 20 వేల కోట్ల రూపాయల నిధులు ఖజానాకు వస్తాయని, అదే జరిగితే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయడానికి ఆర్ధికపరమైన ఇబ్బందులేమీ ఉండవని, సాఫీగా గ్యారెంటీలన్నీ అమలు చేయవచ్చునని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు. అందుచేతనే 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ మొత్తం (ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలుపుకొని) సుమారు 2.85 లక్షల కోట్ల రూపాయల వరకూ ప్రవేశపెట్టగలిగితే సమస్యలన్నీ అధిగమించినట్లు అవుతుందని అంటున్నారు. ప్రభుత్వ ఖర్చుల్లో అత్యంత ప్రధానమైన ఉద్యోగుల జీతభత్యాలకు సుమారు 39 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, పెన్షన్లకు 13025 కోట్లు, సబ్సిడీలకు ప్రస్తుత లెక్కల ప్రకారం 12,959 కోట్ల రూపాయలు, అప్పులకు వడ్డీలు- ఇతర చెల్లింపులకు ప్రస్తుతం 22,408 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని, వీటన్నింటికీ కలిపిఒక లక్షా 25 వేల కోట్ల రూపాయల నిధులు సరిపోతాయని, రెవెన్యూ రాబడుల్లోనే ఇంకనూ ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయలు మిగులుతాయని, వాటిని ఆరు గ్యారెంటీలకు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవచ్చునని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ విజయవంతంగా అమలు చేయవచ్చునని ఆ అధికారులు వివరించారు. అందుకు తగినట్లుగా 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపకల్పన చేసే దిశగా కసరత్తులు మొదలుపెట్టామని వివరించారు.

ఈనెల 20వ తేదీనాటికల్లా కొత్త బడ్జెట్ రూపకల్పనపై మరింత స్పష్టత వస్తుందని, ఎవ్వరైనా… ఎన్ని విధాలుగా కసరత్తులు చేసినా పైన తెలిపిన వ్యూహంతోనే బడ్జెట్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అదీగాక సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో… కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో కూడా తెలియదని, అందుకే కేంద్రంపై పూర్తిస్థాయిలో ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇప్పుడు ఖజానాకు వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకొని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి రుణాలను సమీకరించుకొని, సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అన్వేషించి అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకునే ఏర్పాట్లు చేసుకుంటే సరికోతుందని ఆ అధికారులు వివరించారు. ఈ వ్యూహంతోనే తాము కసరత్తులు ప్రారంభించామని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News