Monday, January 27, 2025

రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర

- Advertisement -
- Advertisement -

యుజిసి కొత్త నిబంధనల పేరిట హక్కులను కాలరాసే
కుట్ర విసిల నియామకంలో ఎవరి జోక్యాన్ని సహించం
కేంద్రం ముసాయిదాను మేం వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే
మూడు రాష్ట్రాల సిఎంలతో చర్చించా ప్రొఫెసర్ల పదవీ
విరమణ వయస్సు 65కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తాం
అంబేడ్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఫీజు
రీయింబర్స్‌మెంట్: సిఎం రేవంత్‌రెడ్డి వర్సిటీలో నాలుగు
భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని, ఇది మంచి పరిణామం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం పరిధిలోని యూజీసీ ద్వారా చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, రాష్ట్రాల పరిధిలో జరిగే వీసీల నియామకాన్ని కేంద్రం లాగేసుకొని వాళ్ళే వీసీలను నియమించేలా మార్గాదర్శకాలు రూపొందించి డ్రాఫ్ట్‌ను రాష్ట్రాలకు పంపారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడానని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం తో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

అదేవిధంగా మరో నాలుగు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనతరం ఆయన విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఉద్యోగులు, విద్యార్ధులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వర్శీటీకి అటు మౌలిక వసతులతో పాటు ఇటు ఖాళీల భర్తీని చేపట్టి పటిష్ట పరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని విశ్వవిద్యలయల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి విదివిధానాలను రూపొందించడానికే ప్రొఫెసర్ చక్రపాణి నేతృత్వంలో కమిటీని వేశామన్నారు. సీనియర్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రోఫెస్సర్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాల్లో నిష్ణాతులను వీసీలుగా నియమించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అమలవుతున్న మాదిరిగానే అంబేద్కర్ విశ్వవిద్యాయంలో అభ్యసించే విద్యార్థులకూ ఫీజు రీంబర్స్‌మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం గ్రాడ్యుయేషన్ స్కీం కింద లక్ష మంది దళిత, పేద విద్యార్ధులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమ అమలు అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు : గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మరో 10 సంవత్సరాలు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. పద్మ అవార్డుల్లో సైతం తెలంగాణ కు అన్యాయం జరిగిందని, గద్దర్ , జయధీర్ , గోరెటి వెంకన్న, అందెశ్రీ వంటి ప్రముఖుల పేర్లను తెలంగాణ ప్రభుత్వం పంపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

అన్ని విశ్వ విద్యాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రా్రష్ట్రంలో ఉన్నత విద్యా వ్యాప్తికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దానికి అవసరమైన సూచనలు సలహాలు తెలంగాణలోని మేధావులు, అధ్యాపకులు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నఅంబేద్కర్ ఓపెన్ వర్సీటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతను అందిస్తుందని వివరించారు.

అంబేద్కర్ వర్సిటీలో అన్ని కోర్సులు : అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆచార్య చక్రపాణి మాట్లాడుతూ అంబేద్కర్ వర్శీటీ లో చివరగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎం హోదాలో చివరగా అడుగు పెడితే తిరిగి 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తమ యూనివర్సిటీలో అడుగు పెట్టారని ఇది తమకు శుభ సూచకమన్నారు. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ కి తక్కువ కాకుండా అన్ని కోర్సులు అంబేద్కర్ వర్సిటీలో అందిస్తున్నామని, ఇటీవలే పీఎం – ఉషా నిధుల కింద యూజీసీ నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అందులో భాగంగా దాదాపు రూ. 10 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న డిజిటల్ రీసోర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ సెంటర్ ద్వారా భవిష్యత్తులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలను, బోధనను, ఇతర విద్యార్థి సేవలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా డిజిటల్ కంటెంట్ రూపంలో అందజేయడానికి వీలవుతుందని వివరించారు.

సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్‌ను దాదాపు రూ. 3 కోట్ల వ్యయంతో కొత్త ప్రయోగశాలలను నిర్మించనున్నట్లు, దీనికి గాను యూజీసీ పీఎం ఉషా స్కీం కింద ఆర్థిక సాయం అందజేస్తుందని వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు కూడా ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణను ఇవ్వడానికి, కనీసం ప్రతి ఏడాది 10 వేల మంది నిపుణులను అందించడానికి ఒక ప్రత్యేక పూర్తి స్థాయి నైపుణ్య శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆలోచన రేవంత్ రెడ్డి మానస పుత్రిక అని వెల్లడించారు. ఈ భవన నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం మంచి పరిణామమని ఘంటా చక్రపాణి వివరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో వివిధ రకాల సేవలు అందిస్తూ రాత్రింబవళ్లు ఇక్కడ పనిచేస్తున్న ఎలక్ట్రిషన్స్, ప్లంబర్లు, కార్పెంటర్, డ్రైవర్లు నివాస వసతి కోసం వారికి డబుల్ బెడ్ రూమ్ సైజులో గౌరవప్రదమైన గృహ సముదాయాన్ని నిర్మించాలని యూనివర్సిటీ సంకల్పించిందని,ఆ భవన సముదాయ నిర్మానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి, ఉన్నత విద్యా కార్యదర్శి డా.యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వి. బాలకిస్టా రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రొ. హర గోపాల్, మాజీ వీసీ లు ప్రొ. వీఎస్ ప్రసాద్, ప్రొ. రామచంద్రం, ప్రొ. వాయునందన్, ప్రొ. వి. వెంకయ్య, వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. సూర్య ధనంజయ్, ఇఫ్లూ ఇంచార్జ్ వీసీ ప్రొ. లక్ష్మీ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొ. పురుషోత్తం, ప్రొ. ఎస్.కె. మహమూద్, అంబేద్కర్ వర్సిటీ వ్యవస్థాపక వీసీ ప్రొ. రాం రెడ్డి సతీమణి ప్రమీలా రాం రెడ్డి, పలు విద్యాసంస్థలకు సంబంధించిన విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి వందన సమర్పణ చేయగా పలు విభాగాల డైరక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, పలువురు మాజీ ఉప కులపతులు, రిటైర్డ్ అధ్యాపకులు, పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News