నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నిధులు జమ
పథకం అమలు పర్యవేక్షణకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు
లబ్ధిదారులకు స్కీంను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ
జిల్లా కమిటీ పర్యవేక్షణలో దళిత రక్షణ నిధి
లబ్ధిదారుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు
దళితబంధు అమలుకు మార్గదర్శకాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అర్హులైన ఎస్‌సి కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల మొత్తాన్ని జమ చేయాలని రాష్ట్ర ఎస్‌సి కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కరుణాకర్ మార్గదర్శకాలలో పేర్కొన్నారు.దళితుల బంధు పథకం కింద రూపొందించిన పథకాల జాబితాలో ఎస్‌సి కుటుంబాలు తమకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయం సృష్టించే పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలుకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఈ కమిటీలు దళిత బంధు పథకం కింద లబ్దిపొందిన వారికి సహకారం అందించడంతోపాటు స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్, పథకం అమలు, పర్యవేక్షణ కార్యకలాపాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జెడ్‌పి సిఇఒ, డిపిఒ, డిఆర్‌డిఎ లేదా అగ్రికల్చర్ లేదా ఎహెచ్ లేదా రవాణా శాఖ లేదా పరిశ్రమల శాఖల నుంచి అధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఎస్‌సి సొసైటీ ఇడి, ఇద్దరు నామినేటెడ్ వ్యక్తులు ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపిడిఒ, తహసీల్దార్, ఎంపిటిఒ, ఎంఎజిఒ, వెట్ ఎఎస్, ఇద్దరు నామినేటెడ్ వ్యక్తు లు ఉంటారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి లో పంచాయతీ కార్యదర్శి, అగ్రికల్చర్ ఇఒ, విఆర్‌ఎ, వెటర్నరీ ఎఎస్, ఇద్దరు నామినేటెడ్ వ్యక్తులు ఉంటారు.
దళిత బంధు కమిటీ విధులు
దళిత బంధు కమిటీ అవగాహన క్యాంపులు నిర్వహించడం, డాటా బేస్‌లో అర్హులైన దళిత కుటుంబాల రిజిస్ట్రేషన్లు, కుటుంబాలకు అవసరమైన మార్గదర్శనం చేయడం, జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసీడింగ్స్‌ను జారీ చేయడం, ఎంపికైన దళిత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో విడుదల చేయడం, అవసరమైన చోట కెపాసిటీ బిల్డింగ్, మెంటార్షిప్ అందించడం, పథకం కింద లబ్దిపొందిన కుటుంబాలు వారు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను ప్రారంభించేలా అవసరమైన సహాయం అందించడం, లబ్దిదారుల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ గుర్తింపు కార్డు జారీ చేయడం, ఇన్సూరెన్స్ ఏజెన్సీ(పబ్లిక్ సెక్టార్) నుంచి యూనిట్ ధరకు సరిపడే ఇన్సూరెన్స్ లభించేలా ఇన్సూరెన్స్ ఇప్పించడం వంటి విధులు నిర్వహించాలి. ఆ తర్వాత పథకం అమలుకు మండల, గ్రామ స్థాయి కమిటీలు లబ్దిదారుల కుటుంబాలతో నెలవారీగా సమావేశాలు నిర్వహించి పథకం అమలు, లాభాలను పర్యవేక్షించాలి. ఈ సమాశాలలో లబ్దిదారుల కుటుంబాల సమస్యలు, ఇతర గ్యాప్స్ విని అవసరమైన పరిష్కార మార్గాలు చూపించి మార్గదర్శనం చేయాలి. ఈ కమిటీలు పథకం అమలు, పురోగతిని డాటా బేస్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి.
దళిత బంధు పథకం కింద లబ్దిపొందిన కుటుంబాల నుంచి రూ.10 వేలు, అంతే సమాన మొత్తాన్ని జిల్లా ఎస్‌సి కార్పోరేషన్ నుంచి తీసుకుని రూ.20 వేలతో జిల్లా స్థాయిలో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయాలి. ఈ నిధి కోసం ప్రత్యేక ఎస్‌బి ఖాతాను తెరవాలి. ప్రతి ఏడాది లబ్దిదారుల కుటుంబాల దళిత రక్షణ నిధికి రూ.వెయ్యి ఇవ్వాలి. ఈ నిధిని పథకం అమలులో లబ్ధిదారుల కుటుంబాలకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వారి రక్షణ కోసం ఉపయోగించాలి. దళిత రక్షణ నిధి జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది. దాంతో తెలంగాణ దళిత బంధు అమలుకు జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.