Friday, November 22, 2024

ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ!

- Advertisement -
- Advertisement -

త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం,  119 నియోజకవర్గాలు…. 4,16,500 ఇళ్లు మంజూరు

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో పథకం అమలుకు సిద్ధం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ’అభయ హస్తం’ పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది.

స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని ఇవ్వనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. ఆ ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

33,500 ఇళ్లు రిజర్వ్ కోటా కింద
మిగతా 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందజేయనుంది. బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు (రూప్) స్థాయిలో రూ.లక్ష సాయం చేయనుంది. పైకప్పు నిర్మాణం తరువాత రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యా క రూ.లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది.

మార్గదర్శకాలు ఇలా…
లబ్ధిదారుడు విధిగా దారిద్య్ర రేఖ( బిపిఎల్)కు దిగువన ఉన్న వారై ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు. అర్హులకు సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి. వారు గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులు అవుతారు. అద్దె ఇంట్లో ఉంటున్నా ఈ పథకానికి అర్హత పొందవచ్చు. వివాహమైనా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు. ఒంటరి మహిళలు కూడా లబ్ధిదారులే.

మహిళల పేరు మీద మంజూరు
ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీద కూడా ఇస్తారు. ఆ జిల్లా ఇన్‌చార్జీ మంత్రిని సంప్రదించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు. జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి. లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News