Monday, December 23, 2024

దేశానికి గుజరాత్ ఆదర్శమా!?

- Advertisement -
- Advertisement -

‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” ఇది దేశ తిరోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెపుతున్న మాట. శ్రీరామ నవమి సందర్భంగా గత ఆదివారం గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, మత ఘర్షణలు, విధ్వంసం ఈ నానుడిని ధ్రువపరుస్తున్నాయి. ఈ అల్లర్లు గుజరాత్‌తో ఆగలేదు. బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా పాకాయి. దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకాయి.
శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో కత్తులు, కాషాయ జెండాలు పట్టుకుని పరుగులు తీయడం వల్ల శాంతికి, మత సామరస్యానికి పెద్ద ఎత్తున విఘాతం కలిగింది.గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీరామ నవమి ఊరేగింపు జరుగుతోంది. అషఫ్ నగర్‌లోకి ఊరేగింపు ప్రవేశించడంతో, ముస్లింలు అధికంగా ఉండే ఆ ప్రాంతంలో వారు మెద్దెలపైకెక్కి చూస్తున్నారు. ముస్లింలు తమను వెక్కిరించారని ఆరోపిస్తూ, ఆ పట్టణంలోని వేరే ప్రాంతం లో హిందుత్వవాదులు హింసకు పాల్పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంలోకి ప్రదర్శనను పోలీసులు అనుమతించ లేదు. దీన్ని లెక్కచేయకుండా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు తమ ప్రదర్శనను ఆ ప్రాంతంలోకి బలవంతంగా నడిపారు. ఫలితంగా రాళ్ళు విసురుకోవడం, గృహ దహనాలకు పాల్పడడం, వాహనాలకు నిప్పు పెట్టడం, వ్యాపార సముదాయాలను ధ్వంసం చేయడం వంటి విధ్వంసకర సంఘటనలు జరిగాయి. ఈ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడడంతో వారు భాష్పవాయు గోళాలను ప్రయోగించి, 144 వ సెక్షన్‌ను విధించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. భక్తిభావంతో జరగాల్సిన శ్రీరామ నవమి ఊరేగింపులో కత్తులు పుచ్చుకుని తిరగుతున్న దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. ఎప్పుడైతే ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంలోకి ఊరేగింపు వస్తోందో, చాలా మంది భయకంపితులై తలుపులు, కిటికీలు మూసేసుకుని ఇళ్ళలోనే ఉండిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినదిస్తూ, కత్తులు పుచ్చుకుని, కాషాయ జెండాలు పట్టుకుని కొందరు పరుగులు తీస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇళ్ళలో దాక్కోకుండా అమాయకంగా రోడ్లోనే ఉన్న ఫరీద్ అనే 19 ఏళ్ళ యువకుడి తలపగిలింది. అతనిప్పుడు ఆస్పత్రిలో ఆందోళనకర స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కంభాట్ నగరంలో జరిగిన మత ఘర్షణలో 65 ఏళ్ళ వృద్ధుడు మృతి చెందాడు. హిందువులు శ్రీరామ నవమి ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారు. ‘జై హిందూ రాష్ర్ట’, ‘మనమంతా కలిసి రామ రాజ్యాన్ని నిర్మిద్దాం’ అంటూ రాముడి చిత్రపటంతో గుజరాతీ భాషలో సామాజిక మాధ్యమాలలో ఆ కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. అసలు ఇదంతా ఏరకమైన భక్తి భావం!? శ్రీరామ నవమిని ఆధారం చేసుకుని ముస్లింలపైన తమ ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేసిన యత్నంలా కనిపిస్తోంది.
గత నెల 17వ తేదీన హోలీ సందర్భంగా హిమ్మత్‌నగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని సంధేలి గ్రామంలో ముస్లిం వ్యతిరేక నినాదాలతో హింసకు పాల్పడ్డారు. మత ఊరేగింపుల సందర్భంగా ఇలా దాడులు చేసి, మత ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్‌కు చెందిన ‘నాగరిక అధికార్ మంచ్ గుజరాత్’ (ఎన్.ఎ.ఎం.జి) అనే హక్కుల సంస్థ గుజరాత్ డిజిపికి విజ్ఞప్తి చేసింది. మత ఊరేగింపులలో అనుమతి లేకుండా ఆయుధాలను ధరించి, హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేసింది. రంజాన్ సందర్భంగా వారి విశ్వాసాలకు భంగం వాటిల్లేలా హిమ్మత్‌నగర్‌లో, దాని పరిసరాలలో ఉన్న అషఫ్‌న్రగర్, బగీచ విస్టార్, చపారియా, శక్తినగర్, మోతిపుర విస్తార్, హసన్‌నగర్, మాలికి చపారియాలలో ముస్లింల ఇళ్ళు, దుకాణాలను దోచుకుని, వారి ప్రార్థనాలయాలకు కూడా కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విధ్వంసమంతా కేవలం 8 గంటలలో పూర్తి చేశారు. ఫలితంగా హిమ్మత్‌నగర్‌లోని హిందువుల నివాసాలకు సమీపంలో ఉన్న కొన్ని ముస్లిం కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి, భద్రత కోసం ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలకు తరలివెళ్ళిపోయాయి. గుజరాత్‌లోని ద్వారకా, బర్డోలిలో కూడా శ్రీరామ నవమి సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో హిమ్మత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి కేవలం రెండువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
మధ్యప్రదేశ్‌లోని ఖార్‌గోన్‌లో శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో 27 మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన మత ఘర్షణలు అర్ధరాత్రి ఒంటిగంటవరకు నిరాటంకంగా సాగాయి. ఇరవై ఇళ్ళు, షాపులకు నిప్పంటించారు. ఫలితంగా పట్టణంలోని రహీంనగర్‌లో కర్ఫ్యూ విధించారు. హిందువుల ఊరేగింపులో అభ్యంతరకరమైన సంగీతం పెట్టారని ముస్లింల ఆరోపణ. ఊరేగింపుపై ముస్లింలు రాళ్ళు రువ్వారని ఆరోపిస్తూ, జిల్లా అధికార యంత్రాంగమే ప్రతీకార చర్యకు పాల్పడి, అనేక మంది ముస్లింల ఇళ్ళను నేలమట్టం చేసింది. అక్కడి తలాబ్ చౌక్‌లో జామా మసీదు కాంప్లెక్స్‌ను కూలగొట్టడానికి వచ్చిన పోలీసులను స్థానిక ముస్లింలు అడ్డుకోవడంతో వారు వెనుతిరిగారు. స్థానికులు వెనుతిరగగానే ఆ కాంప్లెక్స్‌ను మళ్ళీ కూలగొట్టడం మొదలు పెట్టారు. బర్వానీ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నమదగౌన్ గ్రామం నుంచి వస్తున్న ప్రదర్శనపై రాళ్ళు రువ్వారు. ప్రతీకారంగా కొన్ని అంగళ్ళను, వాహనాలను ధ్వంసం చేశారు.
కర్ణాటకలోని ధార్వాడ్ సమీపంలో ఉన్న నుగ్గికేరి హనుమంత ఆలయం వద్ద ఒక ముస్లిం నిర్వహిస్తున్న దుకాణాన్ని శ్రీరాం సేన ధ్వంసం చేసింది. విద్యాలయాల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించడం ద్వారా వారిపైన సాంస్కృతిక దాడిని తీవ్రతరం చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా జార్ఖండ్‌లో జరిగిన మత ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లోని బొఖారో జిల్లాలో ఉన్న ఫుస్రో రాజ్‌బెదాలో జరిగిన మత ఘర్షణల్లో పాతిక మంది వరకు గాయపడ్డారు. బీహార్‌లో మసీదుపై కాషాయ జెండా ఎగురవేయడానికి హిందుత్వ వాదులు ప్రయత్నించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. బెంగాల్ రాష్ర్ట శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన బిజెపి ఉనికి కోసం హిందూత్వాన్ని ఉపయోగించుకుంటోంది. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జార్ఖండ్‌ను ఆనుకుని ఉన్న బెంగాల్‌లోని కోల్‌కతా, బంకురాలో జరిగిన మతఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. బంకురాలో మసీదు ముందు నుంచి ఊరేగింపు నిర్వహించవద్దని పోలీసులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. పోలీసు బారికేడ్లను తోసుకుని వెళ్ళడంతో మతఘర్షణలు జరిగాయి. హౌరా నగరంలో కూడా మత ఘర్షణలు జరిగాయి. గోవాలో సైతం ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో జరిగిన శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు పడడంతో మతఘర్షణలు జరిగి పలువురు గాయపడ్డారు. ఇస్లాంపురలో యువకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తుండగా రాళ్ళు పడ్డాయని ఆరోపిస్తూ, ముస్లింలు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్ళి ఒక యువకుడిపై దాడి చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ముంబయిలోని మన్‌కుర్దు ప్రాంతంలో కొందరు దుండగులు పాతిక వాహనాలను ధ్వంసం చేసి, రెండు వర్గాల మధ్య మతచిచ్చు రేపడానికి ప్రయత్నం చేశారు. ముంబయితో పాటు మహారాష్ర్టలో కూడా కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీని సైతం ఈ మత ఘర్షణలు తాకాయి. శ్రీరామ నవమి సందర్భంగా జెఎన్‌యులోని కావేరి హాస్టల్‌లో మాంసాహారం వడ్డించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎబివిపి కార్యకర్తలు ఆ హాస్టల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగినవి మత ఘర్షణలు కావని, కొత్త ఆలోచనల అభివృద్ది అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమర్థించుకోవడాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి!? కేంద్రంలో బిజెపి 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ముస్లింలపైన దాడులు పెరిగాయి. బిజెపి ఉనికిలోకి రావడానికి మత ఘర్షణలే దోహదం చేశాయి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న ఏకైక ఎజెండాతో 1992లో మొదలైన అద్వానీ రథయాత్ర దేశంలో మత ఘర్షణలకు ఊతమిచ్చింది. ఒక్క ముంబయి అల్లర్లలోనే 900 మంది మృతి చెందారు! గుజరాత్‌లో 2002లో జరిగిన మతఘర్షణల్లో రెండు వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ మత ఘర్షణల నుంచే నేటి దేశ నాయకులు ఉద్భవించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ రాష్ర్ట శాసన సభకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే శ్రీరామ నవమి సందర్భంగా ఈ మత ఘర్షణలు జరిగాయి. ఈ మత ఘర్షణల వెనుక రాజకీయ శక్తుల పునరేకీకరణ దాగున్నది. ఈ మత ఘర్షణలను ఆసరా చేసుకుని తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని, కొత్త రాష్ట్రాలకు వ్యాపించాలని, తద్వారా హిందూ రాష్ర్టంఏర్పాటు చేయాలని హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అహింసను ప్రవచించిన మహాత్ముడు జన్మించిన గుజరాత్ మత హింసతో ఇప్పుడొక మానని గాయమైంది. దేశానికి ఇదెలా ఆదర్శమవుతుంది? గుజరాత్ అల్లర్ల సందర్భంగా 2002లో ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రముఖ విప్లవ కవి జ్వాలాముఖి రాసిన ‘భస్మసింహాసనం’ కావ్యంలోని ఈ చరణాలు గుజరాత్‌ను ఎలా అర్థం చేసుకోవాలో చెపుతాయి.
“గుజరాత్ మదించిన అబద్ధాల ప్రయోగ శాల
దాన్ని నిజాల నిప్పుల మీద కాల్చి నిగ్గు తేల్చాలి
గుజరాత్ క్రూరత్వ హిందుత్వ చీకటి చెరసాల
దాన్ని సెక్యులర్ సంస్కారంతో బద్దలు కొట్టాలి
గుజరాత్ చచ్చిన మధ్యయుగాల వధ్యశిల
దాన్ని ప్రజల ప్రజాస్వామ్యంతో ముంచెత్తాలి”

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News