Monday, December 23, 2024

గుజరాత్ ఓటు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: నేడు తొలివిడత పోలింగ్ జరగనున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమైనవి కావు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైనందున అక్కడ బిజెపి తిరిగి గెలిస్తే 2014లో ఆయన వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. గుజరాత్‌లో బిజెపి 27 సంవత్సరాలుగా ఏకధాటిగా పాలిస్తోంది. అందుచేత ఈ ఎన్నికల్లో అది సునాయాసంగా గట్టెక్కడం మాటలు కాదని కొన్ని వర్గాలకు చెందిన పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఎన్నికల్లో బిజెపి గర్వించదగిన ఫలితాలను సాధించుకోలేకపోయింది.

182 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 92 కాగా అంతకు మించి కేవలం ఏడు స్థానాలు (99) మాత్రమే గెలుచుకొని అది మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. 77 స్థానాలతో కాంగ్రెస్ దానికి గట్టి పోటీ ఇవ్వగలిగింది. 2012 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే 2017లో బిజెపి పొందిన విజయం చెప్పుకోదగినది కాదు. 2012లో అది 116 స్థానాలతో అఖండ మెజారిటీని నిరూపించుకొన్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 60 స్థానాలే లభించాయి. 1995 నుంచి గుజరాత్‌లో అధికారంలో వున్న బిజెపి బలం గత ఎన్నికల నుంచి క్షీణిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. 2002లో పడిన బలమైన మోడీత్వ హిందూ ఓటు పునాది బలహీనపడుతున్నదని భావించాలా? 2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంపై ఆయన ప్రభావం తగ్గిందనుకోవాలా? ఆయన ఎనిమిదేళ్ల పాలనలో తీసుకొన్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అభివృద్ధిలో ఏర్పడిన ప్రతిష్టంభన, ఇటీవలి అతిపెద్ద మోర్బీ విషాదం ఈ ఎన్నికల్లో బిజెపిపై వ్యతిరేక ప్రభావం చూపుతాయనే అంచనా నిజమవుతుందా? ఈ ప్రశ్నలకు సైతం ఈ ఎన్నికల నుంచి సమాధానం రావలసి వుంది.

ఈసారి కూడా అక్కడ బిజెపికి ఎదురులేని పరిస్థితి రుజువై వరుసగా ఏడోసారి మళ్ళీ అధికారానికి రాగలిగితే ప్రధాని మోడీకి తిరుగుండదు. అందుకే ఈ ఎన్నికలను ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నారు. ఇప్పటికే అనేకసార్లు బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ వచ్చే 5వ తేదీన రెండో విడత ముగిసే లోగా కనీసం పది సభల్లో ప్రసంగించనున్నారు. నేడు, రేపటి లోగానే ఏడు సభల్లో మాట్లాడనున్నారు. ‘ఈ గుజరాత్ నిర్మాతను నేనే’ అని ప్రతి ఒక్క గుజరాతీ భావించేలా ఆ నినాదాన్ని ఆయన అందరి చేత ఇప్పిస్తున్నారు. ఆదివాసీలు కానివ్వండి, మత్సకారులు కానివ్వండి, గ్రామీణులు కానివ్వండి, పట్టణ ప్రజలు కానివ్వండి అందరూ ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో తొణికిసలాడుతున్నారు. తమ విశేష కృషితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారు అని మోడీ అంటున్నారు. నేనే గుజరాత్ నిర్మాతను అనే నినాదంతో 34 లక్షల మంది సెల్ఫీ తీసుకొన్నారని బిజెపి వారు చెబుతున్నారు. గుజరాతీననే భావోద్వేగంలో ఓటర్లు తలమునకలయేటట్టు చేసి వారి ఓటును సాధించడం ప్రధాని మోడీ వ్యూహంగా స్పష్టపడుతున్నది.

దీనికి తోడు ఉచితాలకు తాను వ్యతిరేకమన్న ఆయన ప్రకటనకు విరుద్ధంగా బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో అనేక వాగ్దానాలను గుప్పించింది. మత్సకారులకు బోట్లు నడుపుకోడానికి కిరోసిన్ పెట్రోల్ సమకూరుస్తామని, గోశాలలు నడుపుతున్న వారికి బకాయి పడిన సొమ్మును చెల్లిస్తామని వగైరా వాగ్దానాలు చేస్తున్నది. ఈసారి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుజరాత్‌లో ప్రచారం చేపట్టారు. ప్రతి చిన్న, పెద్ద ఎన్నికలకు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి నా మొఖం చూసి ఓటు వేయండి అని గుజరాత్ ప్రజలను వేడుకోడాన్ని ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రధానికి రావణుడిలా వంద ముఖాలున్నాయా అని ఆయన వేసిన ప్రశ్న తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఇది బిజెపికి మేలు చేసి కాంగ్రెస్‌ను మరింత కుంగదీస్తుందా అనే మీమాంస బయలుదేరింది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అక్కడ 40 సభల్లో మాట్లాడారు. దేవాలయాలను దర్శించుకొని తాను హిందువునని బ్రాహ్మణుడినని ప్రకటించుకున్నారు. బహుశా వాటి ఫలితంగానే అప్పుడు కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకోగలిగింది. ఈసారి భారత్ జోడో యాత్రలో నిమగ్నమైన రాహుల్ గుజరాత్ ప్రచార బాధ్యతను తీసుకోలేదు. అయితే గత ఎన్నికల్లో పల్లెల్లో గణనీయమైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఆర్భాట రహితంగా అల్లుకుంటూ వస్తున్నదని, ఇంటింటికీ ప్రచారం చేస్తున్నదని, ఆదివాసీలను తన వైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నదని చెబుతున్నారు. త్రిముఖ పోటీ అనేది గుజరాత్‌లో ఎప్పుడూ లేదని ఆప్ ఆర్భాటమే తప్ప ఆచరణలో ఏమీ సాధించబోదని బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ అది చూపించే ప్రభావం ఎలా వుంటుందనేది అనుమానమే. దానికి పడే ఓట్లు దానిని పంజాబ్‌లో మాదిరిగా అనూహ్యంగా అధికారంలోకి తీసుకు వస్తాయా లేక కాంగ్రెస్, బిజెపిలలో ఏదో ఒక దాని ఓట్లు చీల్చి రెండో దానికి మేలు చేస్తాయా అనేది కీలకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News