Wednesday, January 22, 2025

17 ఏళ్ల కుమారుణ్ని గొలుసులతో కట్టేసి నిర్బంధించిన తల్లి!

- Advertisement -
- Advertisement -

మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి… తన 17 ఏళ్ల కొడుకుని ఇంట్లోనే కట్టేసి నిర్బంధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని బాణాస్కాంత జిల్లాలోని దీశ పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చుట్టుపక్కలవారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఒక ఇంట్లోంచి ఏవో మూలుగులు వినిపిస్తూ ఉండటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన పోలీసులను ఆ ఇంటి యజమానురాలు లోపలకి రానియ్యలేదు. దాంతో వారు బలవంతంగా లోపలకి వచ్చి చూడగా, 17 ఏళ్ల వయసున్న కుర్రాణ్ని ఇనుప గొలుసుతో కట్టేసి, గొలుసు చివరన తాళం వేసి ఉంచటం కనిపించింది. అతను ఆమె కొడుకే కావడం గమనార్హం. తాళం చెవి ఇవ్వమంటే ఆమె నిరాకరించింది. దాంతో పోలీసులు తాళం పగులగొట్టి, బాలుణ్ని విడిపించారు.

బాలుడి తండ్రి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాడు. నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటినుంచీ అతని భార్య మానసిక పరిస్థితి దిగజారింది. ఆమె కుమారుడు ఒక ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తన కొడుకు కూడా తనకు దూరమవుతాడనే భయంతో అతన్ని ఎక్కడకూ వెళ్లకుండా ఇంట్లోనే బంధించి ఉంచసాగింది. గత జులైనుంచి అతను ఇలా ఇంట్లోనే బందీగా ఉన్నాడు. స్నేహితులు వచ్చి అతనికోసం అడిగితే చదువుకుంటున్నాడని చెప్పి పంపించివేసేది.

తన కుమారుడికి ఆమె స్నానం కూడా చేయించడం లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటి యజమానురాలికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వారిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని సూరత్ లో స్థిరపడ్డారు. వారికి తమ తమ్ముడి దుస్థితి గురించి తెలియదు. పోలీసులు తల్లీకొడుకులను ఆస్పత్రికి తరలించి, ఆమె కూతుళ్లకు సమాచారం అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News