Wednesday, January 22, 2025

గుజరాత్ లో కాంగ్రెస్ కు దెబ్బ!

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. మూడుసార్లు ఎంఎల్‌ఏగా ఉన్న గిరిజన నాయకుడు అశ్విన్ కొత్వాల్ మంగళవారం ఎంఎల్‌ఏ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యులలో ఇప్పుడు ఆయన కూడా చేరారు. ఉత్తర గుజరాత్ సబర్‌కాంత జిల్లాలోని ఖేద్‌బ్రహ్మ నుంచి ఆయన మూడు సార్లు ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవిని ఆశించి భంగపడ్డారని తెలుస్తోంది. పార్టీ మాత్రం ఆయనకు బదులుగా సుఖ్‌రామ్ రత్వాను ప్రతిపక్ష నాయకుడిగా ఎంచుకుంది. గత నెల రోజులుగా అశ్విన్ కొత్వాల్ బిజెపితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమ ఆచార్యను కలవడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, గాంధీనగర్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయం ‘కమ్లమ్’లో 2000 మంది మద్దతుదారులతో బిజెపిలో చేరనున్నట్లు తెలిపారు. ఓటములు, పార్టీ నుంచి శాసన సభ్యులు తప్పుకోవడం వంటి కారణంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 77 సీట్ల నుంచి 65 సీట్లకు కుంచించుకుపోయింది. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకుంది. కాగా బిజెపి మాత్రం 99 సీట్ల నుంచి 112 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 182.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News